నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 13 : ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం ఉమ్మడి జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడగా, జనగామ, హనుమకొండ, ములుగులో మోస్తరుగా కురిసింది. చెడగొట్టు వానతో పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట నేలకొరిగింది. మార్కెట్లలో ధాన్యం, మక్కలు కొట్టుకుపోగా, పత్తి తడిసింది. ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లి పలు చోట్ల రవాణా స్తంభించింది.
మహబూబాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడింది. సీరోలు, కురవి మండలాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాళ్లసంకీస వద్ద ఖమ్మం-కురవి జాతీయ రహదారిపై లోలెవల్ వంతెన పైనుంచి వస్తున్న వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డోర్నకల్ శివారులో ఉన్న మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కొత్తగూడ మండ లంలో కొత్తపల్లి వాగు పొంగిపొర్లడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గంగారం మండలం కాటినాగారం-కోమట్లగూడెం మధ్య తాత్కాలికంగా నిర్మించిన రోడ్డుపై వరద నీరు చేరింది. కేసముద్రం మార్కెట్లో మక్కజొన్న తడిసింది. తొర్రూరు మండలంలో పొలాలు నీట మునిగాయి.
నర్సింహులపేట మండలంలో తడిసిన పత్తిని ఆరబెట్టేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. దంతాలపల్లి మండ లంలో కోతకు సిద్ధంగా ఉన్న మక్కజొన్న, వరి పంటలు తడిశాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలు తడవగా, మక్కలు కొట్టుకుపోయాయి. నర్సంపేట మార్కెట్లో మక్కలు కొట్టుకుపోగా, వాటిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. నెక్కొండ మండలంలోని వెంకటాపురం శివారులో చెరువు మత్తడి ఉధృతమవడంతో నెక్కొండ-కేసముద్రం, మహబూబాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్నుంచి నెక్కొండకు వచ్చే ఆర్టీసీ బస్సులను వయా ఇనుగుర్తి మీదుగా నడిపించారు. చంద్రుగొండలో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి చెందాయి.
వట్టెవాగు ఉధృతితో పెద్దకొర్పోలు, చిన్నకొర్పోలు, నాగారం శివార్లలో రాకపోకలకు ఆటంకాలు ఎదుర య్యాయి. జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆరబెట్టిన దాదాపు 3వేలకు పైగా బస్తాల ధాన్యం తడి సింది. 1హెచ్పీ మోటర్లను రైతులు తెచ్చుకొని వరద నీటిని బయటకు తోడేందుకు కష్టాలు పడ్డారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపురం మత్తడి పోస్తుండడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని తిమ్మంపేట నుంచి బాలన్నగూడెం, అబ్బాయిగూడెం వెళ్లే రోడ్డుపై ఉన్న కాజ్వే కూలిపోయింది. దీంతో తిమ్మంపేట నుంచి అబ్బాయి గూడెం, బాలన్నగూడెం, నీలాద్రిపేట తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.