తొర్రూరు, సెప్టెంబర్ 30 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని దుబ్బతాండ సమీపంలో నిర్మించిన 284 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలనే డిమాండ్‌తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు ఉద్యమం కొనసాగిస్తూ వచ్చారు. గత ఏడాది నుండి అర్హులైన వారికి ఇండ్ల కేటాయింపు జరగాలని సిపిఎం పార్టీ అనేక సార్లు అధికారులను కోరినా స్పందన రాకపోవడంతో, మంగళవారం ఉదయం గృహప్రవేశానికి ప్రయత్నించారు.
ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి నిరుపేదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఎంత ఆపినా కూడా నిరుపేదలు వెనుకడుగు వేయకుండా ఇండ్లలోకి చొరబడి కొబ్బరికాయలు కొట్టి, అగర్బత్తీలు వెలిగించి గృహప్రవేశం పూర్తి చేశారు. దీంతో ఒక దశలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ఎమ్మెల్యే గానీ అధికారులు గానీ పట్టించుకోలేదు.
నిరుపేదల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వంపై మాకు విశ్వాసం లేదు. ఈ ఇండ్లు అర్హులైనవారికి కేటాయించకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు. ప్రజల కోసం నిర్మించిన ఇండ్లను సంవత్సరాలుగా ఖాళీగా వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అర్హులైన నిరుపేదలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.