ఖిలావరంగల్: పీడిత ప్రజల విముక్తికి నూతన ప్రజాస్వామిక విప్లవమే ఏకైక మార్గమని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అన్నారు. ఆదివారం ఖిలా వరంగల్ పడమరకోటలోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి, గోదావరిలోయ ప్రతిఘటనా పోరాట నిర్మాత చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ చండ్ర పుల్లారెడ్డి విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. సీపీఐ, సీపీఎం రివిజనిస్టు రాజకీయాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా విప్లవకారులను ఏకం చేస్తూ సీపీఐ ఎంఎల్ పార్టీ ఏర్పాటుకు కృషి చేశాడన్నారు.
గోదావరి నది పరివాహక ప్రాంతంలోని అటవీ మైదాన ప్రాంతాలలో గిరిజన, గిరిజనేతర పేదలను కూడగట్టి ప్రతిఘటనా పోరాటాలు నిర్మించి 10 లక్షల ఎకరాలకు పైగా పేద ప్రజలు సాగు చేసుకొనుటకు నాయకత్వం వహించాడని కొనియాడారు. కేంద్రంలోని మోదీ, అమిత్ షా ప్రభుత్వం పార్లమెంటును అడ్డం పెట్టుకొని బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తూ అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలకు దళారీగా పనిచేస్తుందని విమర్శించారు. మధ్యభారతంలో అమలు జరుపుతున్న ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గ్రేటర్ వరంగల్ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గంగుల దయాకర్, మానవ హక్కుల వేదిక నాయకులు బండి కోటేశ్వరరావు, పీడీఎస్ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేష్, అరుణోదయ నాయకులు నళిగంటి విజయ పాల్, బండి కుమార్, బన్న నరసింగం, మహమ్మద్ ఖాన్, గద్దల ప్రభాకర్, గండ్రతి హరిబాబు, మైదం సంజీవ, సుద్దాల వీరయ్య, నారాయణ, సాంబయ్య, బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.