హనుమకొండ, మే 05 : ప్రపంచ గతిని మార్చిన సిద్ధాంతకర్త, ప్రపంచ మానవాళికి దోపిడి విముక్తి సిద్ధాంతాన్ని అందించిన ప్రపంచ మేధావి, మహనీయుడు కామ్రేడ్ కారల్ మార్క్స్ అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ప్రభాకర్ రెడ్డి, సాదుల శ్రీనివాస్ పేర్కొన్నారు. కారల్ మార్క్స్ జయంతి 207వ జయంతి కార్యక్రమం సోమవారం జిల్లా కమిటీ సభ్యుడు గొడుగు వెంకట్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజాన్ని అనేకమంది తత్వవేత్తలు పరిపరి విధాలుగా విశ్లేషించారు.
కానీ సమాజంలో ఉన్న దోపిడీకి మూలం శ్రమ దోపిడీ అని దానికి వ్యతిరేకంగా వర్గ పోరాటాలు నిర్వహించడం ద్వారా సమాజాన్ని మార్చవచ్చు అనే సిద్ధాంతాన్ని సృష్టించిన సృష్టికర్త కారల్ మార్క్స్ అని కొనియాడారు. సమాజంలో దోపిడీ, పీడన అసామానతలు నిరుద్యోగం, దారిద్య్రం, పేదరికానికి కారణమైన పెట్టుబడి దారి వ్యవస్థను కూల్చి, సమసమాజ స్థాపన కోసం కృషిచేయడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు సూర్నపు సోమయ్య, బోట్ల చక్రపాణి, రాగుల రమేష్, వాంకుడోతు వీరన్న, జి.రాములు, డి.తిరుపతి, కె.లింగయ్య, డి.భాను నాయక్ తదితరులు పాల్గొన్నారు.