కరీమాబాద్ మార్చి 9 : సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయాన్ని(Mamunur Airport) సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య మాట్లాడుతూ 1930లో నిజాం కాలంలో ఏర్పాటు కాబడిన మామునూరు విమానాశ్రయాన్ని 1981 వరకు సేవలందించిందని తెలిపారు. ఆనాడు సిర్పూర్ కాగజ్నగర్ కాగిత పరిశ్రమ అభివృద్ధికి వరంగల్ లోని ఆజాజాహి మిల్స్ అభివృద్ధికి ఉపయోగపడిందని గుర్తు చేశారు. అనేకమంది ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు పర్యటనలకు ఉపయోగపడి అభివృద్ధికి సహకరించిందని అన్నారు.
మధ్యలో కొంత కాలం నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాన్ని ఇప్పుడు మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నిధులు కేటాయించడం మంచి పరిణామం అన్నారు.
ఎయిర్పోర్ట్ అభివృద్ధి కావడం వల్ల ఇక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగడానికి మార్గమవుతుందని తెలిపారు. ప్రభుత్వాలు భూసేకరణకు నిధులు కేటాయించడం శుభ పరిణామమని, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి ఎయిర్పోర్ట్ ను పూర్తి చేసి రాకపోకలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సింగారపు బాబు, ఆరూరి కుమార్, ఎండీ బషీర్, వలదాసు దుర్గయ్య, యారా ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.