ఖిలావరంగల్: వరంగల్ జిల్లాలో ఎరువుల కొరతను నివారించి రైతులకు సరిపడ యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ, అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతి పత్రం సమర్పించారు. రైతులు పత్తి, మొక్కజొన్న, వరి మొదలగు పంటలకు కాంప్లెక్స్ఎరువులతోపాటు యూరియాను కూడా కలిపి వాడుతారని వినతి పత్రంలో తెలిపారు.
గత 15 రోజులుగా రైతులు యూరియా కోసం సొసైటీల వద్ద బారులు తీరుతున్నారని, సరిపడా యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఎకరం నుంచి నాలుగు ఎకరాల వరకు సాగుచేస్తున్నారని, వీరికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తే ఎలా సరిపోతుందో వ్యవసాయ అధికారులకే తెలియాలని ఎద్దేవా చేశారు. అలాగే కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు సొసైటీల నుండి తమకు అనుకూలమైన వారికే బస్తాలు ఇప్పించి రైతులకు మొండి చేయి చూపిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
వరంగల్ జిల్లాలో కొంతమంది వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఎలకంటి రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి గంగుల దయాకర్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు, నాయకులు గట్టి కృష్ణ, బండి కుమార్, జీ అశోక్, ఇనుముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.