నమస్తే నెట్వర్క్, జూన్ 26 : పెరిగిన నిత్యావసర ధరలను నియంత్రించాలని బుధవారం ఉమ్మడి జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. హనుమకొండ అంబేదర్ సెంటర్లో, వరంగల్లోని పోచమ్మమైదాన్ సెంటర్, నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద, నెక్కొండ తదితర ప్రాంతాల్లో వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నెల రోజులుగా నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు విక్రయిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రస్తుతం టమాట, పచ్చి మిర్చి కిలో రూ.100, ఉల్లిగడ్డ రూ. 50కి చేరుకున్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు కఠిన చట్టాలను రూపొందించాలని, లేకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.