ఖిలావరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి సాగు నీటిని అందజేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాష్ మియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఏకశిల పార్క్ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
దేశానికి తిండి పెట్టే రైతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో కష్టాలు తప్పడం లేదన్నారు. సాగునీరు, తాగునీరు సకాలంలో అందించకుండా ప్రాజెక్టుల పేరుతో రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుతం సాగునీరు, యూరియా కొరతతో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులతో పాటు పలు ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేపట్టి ఆయకట్టు చివరి వరకు నీరందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే ఆరుకాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్నారు. లేకుంటే సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు మేకల రవి, దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, సంగీ ఏలేందర్, గన్నారపు రమేష్, ఓర్సు రాజు, ఎండి అక్బర్ పాషా, సుంకరి భవాని, ఏం గోవర్ధన్, పనికిరాల రమేష్, కందిక చెన్నకేశవులు, అయితే యాకయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.