సుబేదారి, జనవరి 4 : బాధితులను ఆఫీస్ చుట్టూ తిప్పించుకోకుండా వెంటనే చిట్టీ డబ్బులు చెల్లించాలని, ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా చిట్‌ఫండ్ సంస్థల యజమానులను హెచ్చరించారు. అక్షర, భవితశ్రీ, అచల, కనకదుర్గ చిట్‌ఫండ్ సంస్థల యజమానులు శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్, సత్యనారాయణ, మణికంఠరెడ్డి, వంద మందికిపైగా చిట్‌ఫండ్ సంస్థల (అక్షర చిట్‌ఫండ్ బాధితులు 50మంది, భవితశ్రీ 15మంది, అచల 5, కనకదుర్గ నుంచి 9 మంది) బాధితులతో సీపీ గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.
చిట్‌ఫండ్ సంస్థల బాధితుల జాబితాను ఆయా యజమానులకు చూపించి ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 16 వరకు మహిళా బాధితులకు, 30లోపు సీనియర్ సిటిజన్స్‌కు, వచ్చే నెల 15లోపు అందరికీ డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బుల చెల్లింపుపై ప్రత్యేకంగా సమీక్ష చేస్తానని, మళ్లీ ఇదే రిపీటైతే పీడీ యాక్టులు పెట్టి జైలుకు పంపిస్తానని సీపీ హెచ్చరించారు. సమావేశంలో క్రైమ్ డీసీపీ మురళీధర్, చిట్‌ఫండ్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వేణుమాధవ్ పాల్గొన్నారు.