హనుమకొండ చౌరస్తా, జూన్ 26 : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి విజయవంతంగా ప్రారంభమైంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలో ఈ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశం పొందవచ్చు.ఈ సందర్భంగా TG POLYCET హెల్ప్ లైన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కేంద్రంలో మొదటి రోజు ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమైంది. ఉదయం నుండే అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరై, మొత్తం 430 మంది అభ్యర్థులు మొదటి రోజే నమోదు చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధంగా, సజావుగా కొనసాగుతోంది.
కౌన్సిలింగ్ ముఖ్య తేదీలు:
ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: 24-06-2025 నుండి 28-06-2025
సర్టిఫికెట్ వెరిఫికేషన్: 26-06-2025 నుండి 29-06-2025
ఆప్షన్ల ఎంపిక: 26-06-2025 నుండి 01-07-2025
తాత్కాలిక సీటు కేటాయింపు: 04-07-2025 లోపు
ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: 04-07-2025 నుండి 06-07-2025
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. బైరిప్రభాకర్ టీజీపాలీసెట్–2025లో 1000లోపు ర్యాంకు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..పాలీసెట్ వంటి అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించాలన్నారు. అభ్యర్థులు సకాలంలో అవసరమైన డాక్యుమెంట్లతో ముందుగా హాజరవ్వాలని సూచించారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్: https://tgpolycet.nic.in పరిశీలించాలని తెలిపారు.