హనుమకొండ సబర్బన్, ఆగస్టు 25 : రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం బీసీలంతా ఏకతాటిపైకి రావాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఆదివారం కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ కన్వీనర్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అధ్యక్షతన బీసీల సమర శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీసీ జనగణన ఒక్కటే పరిష్కార మర్గామని సూచించారు. బీసీ కులాలన్నీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
బీపీ మండల్ మనమడు సూరజ్ మండల్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను సాధించాలంటే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ సాకారం కోసం బీసీలందరం కొట్లాడుదామన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఓరుగల్లు కేంద్రంగా బీసీ ఉద్యమం మొదలైందని, దీన్ని ఉధృతం చేస్తామన్నారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా బీసీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ చట్ట సవరణ ద్వారా సాధించుకోవచ్చని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి పేర్కొన్నారు. బీసీల కోసం బీపీ మండల్, కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ పాత్రను మరువలేమని వినయ్ కుమార్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సమ్మయ్య, రాజయ్య యాదవ్, సతీశ్, క్రాంతి కుమార్, ప్రొఫెసర్లు భాస్కర్, విజయబాబు, దారం జనార్దన్, కృష్ణ బెనర్జీ, వేణు మాధవ్ గౌడ్, పులి రజినీ కాంత్, నరెడ్ల శ్రీధర్, రఘు, గుర్రపు రవీందర్ గౌడ్, గొల్లపల్లి వీరస్వామి, గోలి సుధాకర్, బుద్ధ వెంకన్న, కనక రాజు, మాచర్ల శరత్, పొలపల్లి రామ్మూర్తి, నలబాల రవికుమార్, కృష్ణాగౌడ్, ప్రవీణ్, రఘు పాల్గొన్నారు.