కాశీబుగ్గ, నవంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినా ఫలితం రాలేదన్నారు. సీసీఐ అవలంబిస్తున్న అసమతుల్య అలాట్మెంట్, స్లాట్ బుకింగ్ విధానాలతో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నిర్లక్ష్యం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీసీఐ సీఎండీ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినా నేటికీ ఎలాంటి స్పందన లేదన్నారు.
సీసీఐ జాబ్‌వర్క్ టెండర్ ఫైనలైజేషన్ ద్వారా రేటు రూ.1440 నిర్ణయించి 322 కాటన్ జిన్నింగ్ మిల్లులను ప్రభుత్వం నోటిఫై చేసినట్లు తెలిపారు. ఎల్1, ఎల్2, ఎల్3 విధానంతో వెసులుబాటు కల్పించి అన్ని మిల్లులు నడిపేవిధంగా అమలు చేస్తామని చెప్పి చేయడం లేదన్నారు. దీని ఫలితంగా జాబ్‌వర్క్ అలాట్మెంట్ కొన్ని మిల్లులకే చేశారని, దీంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన లేబర్‌కు పని లేక వెనుదిరిగి పోతున్నారన్నారు. మిల్లుల నెలవారీ మెయింటనెన్స్ చార్జీలు అదనంగా మిల్లర్లపై పడుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.