వరంగల్, జూలై 9 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పక్కా ప్లాన్‌తో అవినీతి జరుతున్నది. ముడుపులు ముట్టనిదే పర్మిషన్ ఇవ్వమన్నట్లుగా అధికారుల తీరు మారింది. కుంటి సాకులు చెబుతూ నెలల తరబడి ప్రజలను తిప్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. అదే డబ్బులిచ్చిన వారికి వారం రోజుల్లోనే అన్ని అనుమతులిచ్చిన పత్రం చేతిలో ఉంటున్నది. టౌన్ ప్లానింగ్ అధికారులకు, భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లైసెన్స్ సర్వేయర్లు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. చేతులకు మట్టి అంటకుండా వీరి ద్వారా అమ్యామ్యాలు దండుకుంటున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం లైసెన్స్ సర్వేయర్ వద్దకు వెళ్లిన దరఖాస్తుదారుడికి అక్కడే ముడుపుల రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అన్నీ సరిగానే ఉన్నా టౌన్ ప్లానింగ్ అధికారుల చేతులు తడపాల్సిందేనని లైసెన్స్ సర్వేయర్లు తేల్చి చెబుతున్నారు. అన్నీ టీపీబీవోనే చూసుకుంటాడని, వారం రోజుల్లోనే పర్మిషన్ వస్తుందంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కాదు.. కూడదంటే అనేక కొర్రీలతో ఇబ్బందులకు గురిచేయడం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు అలవాటుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టౌన్ ప్లానింగ్ విభాగం అదుపు తప్పింది. గత రెండేళ్లుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో ఇన్చార్జి సిటీ ప్లానర్తోనే నెట్టుకొస్తుండగా, సదరు అధికారికి టౌన్ ప్లానింగ్ విభాగంపై పట్టు దక్కడం లేదు. పూర్తిస్థాయిలో దృష్టిసారించక పోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పైసలొచ్చే పనులపైనే దృష్టి పెడుతున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ పెండింగ్‌లను క్లియర్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారు రెండేళ్లుగా బల్దియా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారికి సమాధానం చేప్పేవారు లేరు. పూర్తిగా ఫీజు చెల్లించిన సుమారు 15 వేల దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్‌లు అందాల్సి ఉందంటే టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ విభాగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కొత్తగా ఉద్యోగంలో చేరిన యువ టీపీబీవోలు అమ్యామ్యాలు తీసుకోవడంలో ముదుర్లుగా మారారనే ఆరోపణలున్నాయి. ఆరు నెలల క్రితం బల్దియాకు 10 మంది టీపీబీవోలుగా విధుల్లో చేరారు. మూడు నెలల కిత్రం ఒక్కొక్కరికి నాలుగు డివిజన్లను కేటాయించగా, వాటి పరిధిలో కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ముడుపులు ఇవ్వనిదే పర్మిషన్లు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో ఒక వ్యక్తి అన్ని ధ్రువపత్రాలతో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. టీపీబీవో క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళ్లారు. రూ. 20 వేలు ఇస్తేనే అనుమతి వస్తుందని ముందే చెప్పడంతో లైసెన్స్ సర్వేయర్ సదరు దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేసి ఇచ్చారు. ఇక పెద్ద స్థాయి అధికారులైతే బిల్డర్లతోనే మిలాఖత్ అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పాతవారికి తోడు కొత్తగా కొలువు సాధించిన యువ టీపీబీవోలు చేతివాటంలో ముదిరిపోయారన్న గుసగుసలు టౌన్ ప్లానింగ్ విభాగంలో వినిపిస్తున్నాయి.