టేకుమట్ల, మే12 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట, ఆయిల్ ఫామ్ తోట, డ్రిప్పు కాలిపోయాయి. స్థానికులు రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి గ్రామానికి చెందిన ఓదెల రామారావు తన మొక్కజొన్న పంటలో కంకులను కోసి ఉంచాడు. ఈ క్రమంలో తన మొక్కజొన్న తోటలో నుంచి వెళ్లిన 32 కెవి విద్యుత్ లైన్ స్తంభం వద్ద తీగలపై పిట్ట వాలడంతో మంటలు చెలరేగి మొక్కజొన్న తోటలో పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి.
గమనించిన రైతులు గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులంతా వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నాలుగు ఎకరాల్లోని మొక్కజొన్న సొప్ప, కంకులు కాలిపోయాయని, పక్కనే ఉన్న పైడిపల్లి మల్లయ్యకు చెందిన ఎకరం ఆయిల్ ఫామ్ తోట అంటుకొని అందులో డ్రిప్ పైపులు మొత్తం కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను ఏఈ మణిదీప్ ను వివరణ కోరగా, ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం ఎవరు ఇవ్వలేదని, ఫిర్యాదు చేస్తే ప్రమాదం జరిగిన స్థలానికి విద్యుత్ అధికారులు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను విచారణ జరిపి తెలుసుకుంటామని తెలిపారు.