హనుమకొండ, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అది హనుమకొండ నడిబొడ్డున ఉన్న ఖరీదైన జాగా.. బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉండే రూ. 100 కోట్ల విలువ చేసే ఈ భూమిపై వివాదం నెలకొన్నది. మొన్నటి వరకు ఇందులో గుడిసెలు వేసుకొని నివసించిన పేదలు.. పక్కనే ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్లిపోయారు. దీంతో ఖాళీ అయిన జాగా తమదని కుడా, కాదు తమదంటూ ఓ కుటుంబం పంచాయితీకి దిగాయి. ఈ స్థలం చుట్టూ కుడా చేపట్టిన ప్రహరీ నిర్మాణాన్ని అడ్డుకుంది. దశాబ్దాల క్రితమే తాము కొనుగోలు చేశామని, వివాదం కోర్టులో ఉందంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో కొంత సద్దుమణిగినా.. ఇది ప్రభుత్వ స్థలమని చెబుతున్న రెవెన్యూ, మున్సిపల్, కుడా యంత్రాంగం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
హనుమకొండ బస్టాండ్ సర్కిల్ నుంచి ఏషియన్ శ్రీదేవి మాల్ మధ్యలో మెయిన్ రోడ్డు పక్కనే ఎకరంన్నర స్థలం ఉంది. దశాబ్దాలుగా ఇందులో పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ స్థలం పక్కన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను వీరికి కేటాయించారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ స్థలం ఖాళీ అయ్యింది. ఇది వరంగల్ నగరంలోనే అత్యంత విలువైన (రూ. 100 కోట్లు) స్థలం కావడంతో దాని చుట్టూ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) సోమవారం ప్రహరీ నిర్మాణం ప్రారంభించింది. ఈ పనులు జరుగుతుండగానే ఓ కుటుంబం అక్కడికి వచ్చి ఇందులో 1.08 ఎకరాల స్థలం తమదని, పనులు నిలిపివేయాలంటూ వాదించింది.
ప్రొైక్లెన్ తీసుకొచ్చి భూమిని చదును చేసేందుకు యత్నించింది. దీంతో పనులు చేస్తున్న వారు కుడా అధికారులకు ఫోన్ చేయడంతో వారు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి పోలీసులు చేరుకోగా పేదలు ఖాళీ చేసిన స్థలం తమదని, ఈ వివాదం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. దశాబ్దాల క్రితమే తమ కుటుంబం కొనుగోలు చేసిందని, ఇప్పటివరకు పేదల గుడిసెలు ఉండడంతో రాలేకపోయామన్నారు. ప్రహరీ నిర్మించే అధికారం అధికారులకు లేదని తేల్చి చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు ఏమైనా అభ్యంతరాలుంటే పోలీసు స్టేషన్‌కు వచ్చి లిఖిత పూర్వంగా ఇవ్వాలని ఒప్పించారు. చివరికి వారిని, ప్రొైక్లెన్ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ప్రహరీ పనులను కొనసాగించారు. పేదలు ఖాళీ చేసిన ఖరీదైన స్థలం విషయం ఏమవుతుందనే చర్చ ప్రజల్లో మొదలైంది.
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలం ఎప్పటి నుంచో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే ఉన్నదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గతంలో రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పుడు పనులతో వివాదం నెలకొన్నదని, ఆ తర్వాత సద్దుమణిగిందని అంటున్నారు. ‘ప్రస్తుత హనుమకొండ బస్టాండు, జేఎన్ఎస్ స్టేడియం, స్పోర్ట్స్ హాస్టల్ నుంచి సబ్ స్టేషన్ వరకు 1085, 1086 సర్వే నంబర్లలో దాదాపు 100 ఎకరాల భూమి ఉండేది. దీనిని సేకరించేందుకు 1855లో నిజాం ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. జీవన్‌సింగ్ ఆయన కుమారుడు మన్మోహన్‌సింగ్‌కు పరిహారం చెల్లించి నిజాం ప్రభుత్వం తీసుకుంది. ఆ తర్వాత మున్సిపల్ శాఖ పరిధిలో ఈ స్థలం ఉన్నది. ఆ పిదప కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మారింది.
ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన స్థలం, జీడబ్ల్యూఎంసీ డంపింగ్ వాహనాల యార్డు, పక్కన ప్రహరీ నిర్మించిన మూడు ఎకరాలు, వెనుకవైపు గుడిసెలు ఖాళీ అయిన మూడు ఎకరాలు, ప్రస్తుతం ఓ కుటుంబం వచ్చి తమదంటున్న స్థలం అంతా కలిపి దాదాపు 12 ఎకరాలు ఉంటుంది. 1085 సర్వే నంబర్లోని ఎకరంన్నరలో 1.08 ఎకరాలు తమదని ఓ కుటుంబం చెబుతున్నది. 1965లో పట్వారీగా పని చేసిన దేవులపల్లి శ్రీనివాసరావు ఈ స్థలాన్ని ఓ వ్యక్తి పేరుపై రాసి, ఆ తర్వాత సదరు వ్యక్తి నుంచి అతడే కొనుగోలు చేసినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నారు. అనంతరం శ్రీనివాస్‌రావు నుంచి చెరుపల్లి మల్లారెడ్డి కుటుంబం సభ్యులు వెంకటరమణారెడ్డి, యమున, ప్రీతి పేర్లతో కొనుగోలు చేసినట్లు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ చెత్త పోస్తుంటే కొందరు అడ్డుకోగా, అప్పటి కమిషనర్ శాలినీమిశ్రా జోక్యంతో మొత్తం స్థలమంతా మున్సిపల్ శాఖ నుంచి కుడాకు మారింది. భూమిలోకి ప్రైవేటు వ్యక్తులు రావడంపై అప్పటి తహసీల్దార్ కమ్రు జమాల్ విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా పట్వారీగా పని చేసి ఆ తర్వాత రెవెన్యూ శాఖలో కొనసాగిన శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేశారు. స్థలం పూర్తిగా కుడా అధీనంలోనే ఉంటున్నది. ఆ జాగా మాదంటూ వెంకటరమణారెడ్డి, యమున, ప్రీతి 2004లో కోర్టుకు వెళ్లారు.
జిల్లా కోర్టు విచారణ అనంతరం కుడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తుది తీర్పు రావాల్సి ఉన్నది. ప్రస్తుతం ఈ స్థలం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే ఉన్నది’ అని అధికారులు పేర్కొన్నారు. అయితే దశాబ్దాలుగా ఈ భూమి తమ పేరిట ఉన్నదని, జిల్లా కోర్టులో తమకు అనుకూలంగా ఆదేశాలు వచ్చాయని, ప్రస్తుతం వివాదం హైకోర్టులో ఉన్నదని, తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి పనులు చేయొద్దని సదరు కుటుంబం వాదిస్తున్నది. కాగా, విలువైన ప్రభుత్వ స్థలం విషయమై కుడా అధికారుల ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.