వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాక
సహాయక చర్యల్లో జీడబ్ల్యూఎంసీ అధికారులు
పర్యవేక్షించిన మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య
అలుగుపోస్తున్న భద్రకాళి, వసంతాపూర్ మొద్దుల చెరువులు
జిల్లాను ముసురు వీడడం లేదు. మంగళవారం రోజంతా కురువడంతో ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో పలు కాలనీలను వరద ముంచెత్తింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి 22 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నగరానికి చేరుకున్నాయి. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించాలని, డ్రైనేజీలను శుభ్రం చేయించాలని, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా, జిల్లాలో సగటు వర్షపాతం 1.6 సెంటీమీటర్లుగా నమోదైంది. 24 గంటల్లో శాయంపేట మండలంలో అత్యధికంగా 3.2 సెంటీమీటర్లు, అత్యల్పంగా నడికూడ మండలంలో 0.7 సెంటీమీటర్ల వాన కురిసింది. వరంగల్ భద్రకాళి, శాయంపేట మండలంలోని వసంతాపూర్ మొద్దుల చెరువులు అలుగుపోస్తున్నాయి.
హనుమకొండ సబర్బన్, జూలై 12 : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంగళవారం రోజంతా కురిసిన వర్షంతో నగరంలోని పలు కాలనీల్లో వరద చేరింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించాలని, డ్రైనేజీలను శుభ్రం చేయించాలని, బాధితులను పునరావాస కేంద్రాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లోను మోస్తరుగానే వర్షం పడింది. కాగా, పొద్దంతా ముసురు పడడంతో వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి.
చెరువుల్లోకి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నీళ్లు రాలేదు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, నడికూడ మండలాల్లో మాత్రమే కొంత మేరకు నీళ్లు చెరువుల్లోకి వచ్చాయి. మిగిలిన అన్ని మండలాల్లో స్వల్పంగా నీళ్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో సగటు వర్షపాతం 1.6 సెంటీమీటర్లుగా నమోదైంది. 24 గంటల్లో శాయంపేట మండలంలో అత్యధికంగా 3.2 సెంటీమీటర్లు, ఐనవోలు మండలంలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అత్యల్పంగా నడికూడ మండలంలో 0.7 సెంటీమీటర్లు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో 0.8 సెంటీమీటర్ల వర్షం మాత్రమే పడింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో చెరువులు నిండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుం డా ముసురు పడుతుండడంతో ఇప్పటికే వేసిన పలు పంటలు నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి నగరానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
నగరం జలమయం..
వరంగల్ : ఐదు రోజులుగా ఆగకుండా వర్షం కురుస్తుండడంతో నగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులు నీటితో మునిగిపోయాయి. మంగళవారం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు కాలనీలలోకి వరద నీరు వచ్చింది. ఎప్పటికప్నుడు బల్దియా సిబ్బంది స్పందిస్తూ క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా హైదరాబాద్ నుంచి 22 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నగరానికి చేరుకున్నాయి. నాలుగు డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ముంపు ప్రాంతాల్లో ముందస్తుగా పర్యటించాయి. వరద ముంపు ఉన్న ప్రాంతాలలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య అధికారులతో కలిసి పర్యటించి, పరిస్థితిని పరిశీలించారు. ముంపు నివారణ ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బృందాలు నాలుగు బోట్స్, 25 లైవ్ జాకెట్స్, 15 లైవ్ బాయ్స్, రోప్స్ ఇతర రక్షణ సామాగ్రితో నగరానికి వచ్చాయి.
ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ సాగర్ మాన్ కులారి, సీఐ అంకిత్ మాన్,ఎస్ రజినీకర్ల బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి నగరంలోని ముంపు ప్రాంతాలు టీవీ టవర్ కాలనీ, తులసీ బార్, రాజాజీ నగర్, నయీంనగర్ నాలా, కాకతీయ కాలనీ బ్రిడ్జి, భద్రకాళి నాలా, సంతోషీ మాతా కాలనీ, పోతననగర్ ప్రాంతాల్లో పర్యటించి ముందస్తు చర్యలపై ప్రణాళికలు చేశారు. కాగా, నగరంలో శిథిలావస్థలో ఉన్న గృహలను తొలగించాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. 21వ డివిజన్లోని మెయిన్‌పురా, లోతుకుంట ప్రాంతాల్లో పర్యటించి, శిథిలావస్థ గృహలను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న గృహాల్లోని వారిని వెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు. వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో సత్వర చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. దేశాయిపేట, చిన్నవడ్డేపల్లి మత్తడి, పోచమ్మమైదాన్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఆమెతో పాటు కార్పోరేటర్లు బస్వరాజ్ కుమారస్వామి, సురేష్‌జోషి, అధికారులు ఉన్నారు.
చిన్నబోయిన వడ్డేపల్లి జంక్షన్
నయీంనగర్ : మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పుడూ వాహనాలు, కూలీలలో బిజీగా ఉండే వడ్డేపల్లి జంక్షన్ చిన్నబోయింది. వర్షాల కారణంగా కూడలి నిర్మానుష్యంగా మారింది.
కమలాపూర్ మండలంలో..
మండలంలోని కమలాపూర్, ఉప్పల్, మర్రిపెల్లిగూడెం, శనిగరం, అంబాల గ్రామాల్లోని చెరువుల్లో రోజురోజుకు నీటిమట్టం పెరుగుతుంది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం మండలంలో 6.38 సెంటీమీటర్ల వర్షం కురువడంతో శనిగరంలో రెండు ఇండ్లు, కమలాపూర్‌లో ఒక ఇల్లు పాక్షికంగా కూలిపోయినట్లు తహసీల్దార్ రాణి తెలిపారు.
పరకాలలో..
పట్టణ శివారులోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని చెరువులు మత్తడ్లు పోస్తున్నాయి. పలు గ్రామాల్లో పంట చేన్లలోకి నీరు చేరింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ పరిశీలించారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, కౌన్సిలర్లు ఏకు రాజు, టీఆర్ఎస్ నాయకులు నల్లోల్ల అనిల్, మార్క రఘుపతి ఉన్నారు.
దామెర మండలంలో..
మండలంలోని ఊరుగొండ పెద్ద చెరువు, పులుకూర్తిలోని రంగనాయకుల చెరువు, కోగిల్వాయిలోని శనిగె చెరువు, ముసలమ్మ చెరువు, దామెరలోని నడింగెద్దె చెరువులు వరదనీరు చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రియాజొద్దీన్ సూచించారు.
శాయంపేట మండలంలో..
మండలంలోని చలివాగు ప్రాజెక్టు నీటిమట్టం 19 అడుగులు దాటింది. జోరుగా మత్తడి సాగుతోంది. మండలంలోని చెరువులను ఇరిగేషన్ డీఈఈ గిరిధర్, ఏఈఈ అమృత్ సందర్శించారు. వసంతాపూర్ శివారులోని మొద్దుల చెరువు మత్తడి పోస్తోంది. అలాగే, పెద్దమ్మకుంట, ముసలమ్మకుంట, తిమ్మనకుంట, బొక్కలకుంట, పెద్దచెరువు, పెరుమాండ్లకుంట, కొత్తకుంట, నల్లకుంట, మక్త కుంటలు అలుగుపడుతున్నాయి. కొప్పుల, పెద్దకోడెపాక ,జోగంపల్లి, వసంతాపూర్ గ్రామాలకు వరద ఉధృతితో రాకపోకలు స్తంభించాయి. కాగా, శాయంపేటలోని ఎస్సీ కాలనీ 9వార్డు(మాలవాడ)లో వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో బాధితులు ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ ఆదుకున్నారు. నీరు నిల్వ ఉండకుండా కాల్వ తీయించారు. దీంతో ఆయనకు కాలనీవాసులు బత్తుల కార్తీక్, నాలిక సమ్మయ్య, నాలిక ప్రభాకర్, రవీందర్, పులిచేరు నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆత్మకూరు మండలంలో..
మండలంలోని అన్ని గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రంలో సర్పంచ్ వంగాల స్వాతీభగవాన్రెడ్డి పర్యటిస్తుండగా గొల్లబడి స్కూల్ వెనుక భాగంలోని మునిగంటి భాగమ్మ ఇంటి ముందు విద్యుత్ మీటర్ షార్ట్ సర్క్యూట్ అయింది. అందులో నుంచి మంటలు చేలరేగడంతో సర్పంచ్ వెంటనే విద్యుత్ ఏఈ రవికుమార్‌కు సమస్యను వివరించారు. అలాగే, నీరుకుళ్లలో సరిమిళ్ల విజయ్‌కుమార్, సిరిమిళ్ల శంకరయ్య ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. అందులో నివసిస్తున్న వారిని ప్రజాప్రతినిధులు, అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఐనవోలు మండలంలో..
మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు నిండాయి. మంగళవారం కురిసిన వర్షానికి మండలంలోని ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వీరయ్య ఇల్లు కూలిపోయింది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.