మహబూబాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సకాలంలో పూర్తికాక, గ్రామ పాలన సరిగా జరగక ప్రజలు, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 482 జీపీలుండగా, వాటిలో 258 గ్రామాల్లో మాత్రమే పక్కా పంచాయతీ భవనాలు ఉన్నాయి. మిగతా పంచాయతీలు అద్దె ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో కొనసాగుతున్నాయి.
పల్లె పాలనకు కేంద్ర బిందువైన గ్రామ సచివాలయాలకు సొంత భవనాలుండాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోట జిల్లాలోని 18 మండలాలకు చెందిన 224 గ్రామాల్లో పక్కా పంచాయతీ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ. 20 లక్షల చొప్పున రూ. 44.8 కోట్ల నిధులు మంజూరు చేసింది. వాటిలో 124 ఐటీడీఏ, 84 పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పనులు చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. అందులో 32 భవనాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, 127 వివిధ దశల్లో ఉన్నాయి.
మరో 65 పంచాయతీ భవనాలకు స్థలం లేక పనులు ఇంకా ప్రారంభం కాక నిధులు నిరుపయోగంగా మారాయి. ప్రారంభించిన పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. అద్దె భవనాలు, సర్కారు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలోని ఇరుకు గదుల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగడం వల్ల సౌకర్యాలు లేక సర్పంచ్లు, సెక్రటరీలు, పల్లెపాలన అస్తవ్యస్తంగా మారి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పక్కా భవనాలు లేక పాలక వర్గాలు, అధికారులతో సమావేశాలు, గ్రామ సభలు నిర్వహించేందుకు ఇబ్బందిగా మారుతున్నది.
పంచాయతీకి సంబంధించి వీధి లైట్లు, బ్లీచింగ్ పౌడర్, ఇతర సామగ్రితోపాటు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ వంటి వాటిని ప్రైవేటు వ్యక్తుల వద్ద భద్రపరచాల్సి వస్తున్నది. కొన్ని అద్దె భవనాలు సరిగ్గా లేక వానకాలంలో కురుస్తుండడంతో రికార్డులు, విలువైన వస్తువులు తడిసి పాడైపోతున్నాయి. భవనాలు లేనిచోట కార్యదర్శులు సైతం పని చేయడానికి ఆయిష్టత చూపుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇరుకు గదుల్లో కనీసం కూర్చోలేకపోతున్నారు. ఇప్పటికైనా సంబంధింత అధికారులు స్పందించి నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కుంటుపడుతున్న ప్రగతి
గ్రామ పంచాయతీలకు భవనాలు లేనిచోట్ల పల్లెల ప్రగతి కుంటుపడుతున్నది. ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం గ్రామ సచివాలయం ద్వారానే ప్రజల వద్దకు చేరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పంచాయతీ కార్యాలయాలు లేక పోవడంతో సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరడం లేదు. అద్దె భవనాలను తరచూ మారుస్తుండడంతో పంచాయతీ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
258 జీపీలకే శాశ్వత భవనాలు..
జిల్లాలో 482 గ్రామ పంచాయతీలుండగా 258 జీపీలకే శశ్వాత భవనాలున్నాయి. మిగతా పంచాయతీల భవనాలకు నిధులు మంజూరు కాగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల స్థలాలు లేక పనులు ప్రారంభం కాలేదు. భవనాలు లేని చోట సెక్రటరీలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలని సంబంధిత అధికారులకు తెలిపాం.
– హరిప్రసాద్, డీపీవో, మహబూబాబాద్
చాలా ఇబ్బందిగా ఉంది..
గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తికాక ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం పాఠశాల భవనంలో జీపీని కొనసాగిస్తున్నాం. ఇరుకు గదులుండడంతో రికార్డులు భద్రపరిచేందుకు, సమావేశాల సమయంలో అవస్థలు పడుతున్నాం. మూడేళ్ల క్రితం నిధులు మంజూరైనా నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. పంచాయతీ సామగ్రి బయటపెట్టటంతో చోరీకి గురవుతున్నాయి.
– భూక్యా కవిత, సర్పంచ్, మిర్యాలపెంట, మహబుబాబాద్ జిల్లా