టెహ్రాన్, జూలై 21 : అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు పూనుకుంది. కువైట్, బహ్రెయిన్‌లోని సైనిక లక్ష్యాలపై మంగళవారం డ్రోన్, క్షిపణులతో విరుచుకుపడింది. ముఖ్యంగా బహ్రెయిన్‌లోని అమెజాన్ డాటా సెంటర్‌పై తీవ్రంగా దాడి చేసింది. పలు క్షిపణులతో దాడి చేయడంతో డాటా సెంటర్ ధ్వంసం అయినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీ డాటా మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేసినట్టు తెలిపింది. అలాగే ఆ దేశంలోని ముహార్రక్, రిఫా ప్రాంతాల్లోని రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు వివరించింది.
కువైట్‌లోని అమెరికా వాయు రక్షణ వ్యవస్థలు, ఇతర మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్టు ఐఆర్జీసీ తెలిపింది. ఇరాన్లో పలు చోట్ల వరుసగా 10వ రోజు రాత్రి అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాము ప్రతిదాడులు చేసినట్టు పేర్కొంది. ‘శత్రువులు మరింత నిర్ణయాత్మకమైన డ్రోన్, క్షిపణి దాడుల పరంపరను ఎదుర్కోడానికి సిద్ధం కావాలి’ అని ఐఆర్జీసీ హెచ్చరించినట్టు ఐఆర్ఎన్ఏ తెలిపింది.
కాగా, తమ దేశంలోని పలు విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్లపై ఇరాన్ సోమవారం దాడులు చేయడంతో మంటలు చెలరేగినట్టు కువైట్ ప్రకటించింది. కాగా, హొర్ముజ్‌ను తిరిగి తెరిపించేందుకు ఒత్తిడి తేవడానికి వరుసగా 10వ రోజు కూడా దాడులు తీవ్రంగా కొనసాగినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది. కాగా, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ జరుపుతున్న దాడుల్లో ఇంతవరకు 17 మంది అమెరికా సైనికులు మృతి చెందారు. కాగా, తమ సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ అమెరికా సైనికులను హతమారుస్తున్నది. వారు పాల్పడ్డ మరణాలకు అనేక రెట్లు ప్రతీకారం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.