IPS Mahesh Bhagwat | హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్‌ను నిబంధనలకు విరుద్ధంగా వెనుక బెంచీకి పరిమితం చేసి అవమానించారంటూ రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో పెనుదుమారం రేగుతున్నది. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సమీక్షకు డీజీపీ హాజరుకాలేదు. ఇలాంటి సమయంలో ప్రొటోకాల్ ప్రకారం డీజీపీ తర్వాతి హోదాలో ఉన్న అత్యున్నత స్థాయి పోలీస్ అధికారి, ముఖ్యమంత్రి పక్కనే లేదా ప్రధాన టేబుల్‌పై ముందువరుసలో కూర్చోవాలి. కానీ, ఆయన కంటే ఎంతో జూనియర్లు అయిన అధికారులతోపాటు, ప్రమోటీ ఐపీఎస్‌లను దర్జాగా ముందు సీట్లలో కూర్చోబెట్టి, 1995 బ్యాచ్ సీనియర్ అధికారిని వెనుక వరుసకు నెట్టివేశారు.
వినాయక చవితి ఏర్పాట్ల సమీక్షలో సీనియర్ అధికారిని ముందువరుసలో కూర్చోబెట్టకుండా అవమానించడంపై సోషల్ మీడియాలో, అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. పండుగ నిర్వహణ పేరిట అత్యున్నత అధికారిపైనే వివక్ష ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శకులు మండిపడుతున్నారు. సాక్షాత్తు శాంతిభద్రతల అధిపతిగా ఉన్న ఐపీఎస్‌ను అవమానించడం ప్రభుత్వ నైజాన్ని బయటపెట్టిందని మండిపడుతున్నాయి.