హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని యాదాద్రి భువనగిరి ఆర్మ్డ్ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాల అవినీతి అడ్డాగా మారిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా కనీస స్పందన కరువైందని నిప్పులు చెరుగుతున్నాయి. అధ్వానంగా తయారైన ఈ కళాశాలపై కనీస పర్యవేక్షణ కూడా లేదని మంగళవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తాయి. కళాశాలకు సంబంధించిన లక్షల రూపాయాల విలువైన ఆర్మీ సామగ్రిని అమ్ముకుంటున్నారని, జువాలజీ, పొలిటికల్ సైన్స్ తదితర సబ్జెక్టులకు అధ్యాపకులను నియమించకపోవడంతో విద్యార్థుల చదువులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని విద్యార్థి నేతలు తెలిపారు.
మెనూను పాటించడం లేదని, దీనిపై ఫిర్యాదు చేస్తే ‘తినడానికి వచ్చారా? చదవడానికి వచ్చారా? అడ్జస్ట్ అవ్వాలి’ అంటూ అవమానిస్తున్నారని, విద్యార్థినులతో అనేక పనులు చేయిస్తున్నారని వివరించారు. ప్రిన్సిపాల్ క్యాంపస్‌లో నివసించకపోవడం, పీడీ సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో కళాశాల లక్ష్యాలు, విద్యార్థుల భవిత దెబ్బతింటున్నాయని వాపోయారు. కళాశాలలో 5 నెలల క్రితం ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటనపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి విచారణ జరిపించలేదని, స్పోర్ట్స్ మీట్ కోసం రూ.12 లక్షలు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపి పెద్ద మొత్తంలో నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని, తప్పుడు రసీదులను సమర్పించి సొమ్ము స్వాహా చేశారని, వినియోగంలో ఉన్న ఫర్నచర్‌ను స్క్రాప్ కింద అమ్మి సొమ్ము చేసుకున్నారని పేర్కొన్నారు.
పార్ట్‌టైమ్ ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) 5 నెలలుగా విధులకు రాకుండానే పూర్తిస్థాయి వేతనాలను డ్రా చేశారని, ఫేర్వెల్ పార్టీ పేరిట నిరుడు ప్రతి విద్యార్థి నుంచి రూ. 400 చొప్పున వసూలు చేశారని, పార్టీ ఇవ్వకుండానే ఆ సొమ్మును స్వాహా చేశారని తెలిపారు. పరీక్షల సమయంలో ప్రైవేట్ బస్సుల యాజమానులతో కలిసి ఇష్టానుసారంగా బిల్లులు పెట్టారని, అదే సమయంలో ప్రతి విద్యార్థిని నుంచి రోజుకు రూ.210 చొప్పున అదనంగా వసులు చేశారని వివరించారు. ఈ అంశాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతున్నదని మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాల పరిస్థితిని మెరుగుపర్చాలని, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.