హైదరాబాద్, జూలై 21, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం 25 శాతం ఉచిత చికిత్స కోటా కింద క్యాన్సర్ బాధితురాలికి వైద్యం అందించాలని హైకోర్టు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని ఆదేశించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మను తక్షణమే ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జీవో నెం.434, జీవో నెం.80 అమలు తీరుతో పాటు ఉచిత చికిత్స కోటా అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని (డీఎంహెచ్ఓ) ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
25 శాతం ఉచిత కోటా కింద చికిత్స నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బాలె భాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ, పేద రోగులకు 25 శాతం ఇన్పేషెంట్లు, 10 శాతం ఔట్ పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించాలనే షరతుతోనే 1989లో ప్రభుత్వం జీవో నెం.434 ద్వారా 7.35 ఎకరాల భూమిని ఆస్పత్రికి లీజుకు ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.