ములుగు,జూన్2(నమస్తేతెలంగాణ) : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగులో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగిస్తుండగా పోలీస్ కవాతులో పాల్గొన్న ఇద్దరు కానిస్టేబుల్స్ సొమ్మసిల్లి పడిపోయారు. మంత్రికి పోలీస్ గౌరవ వందనం సమర్పించిన అనంతరం ప్రగతి నివేదికలో భాగంగా 40 అంశాలపై మంత్రి ప్రసంగం చేస్తుండగా ఒక కానిస్టేబుల్ కండ్లకు చక్కర వచ్చి కింద పడిపోయాడు. వెంటనే అతన్ని తోటి సిబ్బంది ఎత్తుకొని వేదిక బయటకు తీసుకొని వెళ్లి సపర్యలు చేసి మంచినీళ్లు తాగించగా స్పృహలోకి వచ్చాడు.
కొంత సమయానికి మరో కానిస్టేబుల్ కింద పడిపోతుండగా పక్కన ఉన్న సిబ్బంది అతన్ని పట్టుకొని వేదిక బయటకు తీసుకెళ్లారు. రెండు గంటల పాటు విధి నిర్వహణలో భాగంగా ఎండలో ఉండి పరేడ్ చేసిన అనంతరం మంత్రి ప్రసంగంలో అటెన్షన్లో కదలకుండా ఉండటంతో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై కింద పడిపోయారు. కాగా, సభా వేదిక వద్ద ముందస్తు జాగ్రత్తలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయకపోవడం, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం.