జనగామ, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన అంటూ సోషల్ మీడియా వేదికగా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాంగ్రెస్ పాలన అంతా రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా సాగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరంపై ప్రాజెక్టుపై ఇచ్చిన ప్రజెంటేషన్‌ను జనగామ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకుడు పల్లా సుందర రామిరెడ్డి ఆధ్వర్యంలో లైవ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేయగా స్టేషన్ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి ఎర్రబెల్లి వీక్షించారు.
ఈ కార్యక్రమాన్ని చూసేందుకు అన్ని మండలాల నుంచి పెద్దఎత్తున జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ గాలి మోటర్లు ఎక్కి తిరుగుతూ గాలి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
అమలు కాని ఆరు గ్యారెంటీలు.. 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలన పకన పెట్టి రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని మండిపడ్డారు. ఆనాడు గోదావరి నదిపై అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు నీళ్లు రాని పరిస్థితుల్లో కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం పూర్తిచేస్తేనే తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు.
పోలవరం మూడు సార్లు కూలితే ఒకసారి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదు కానీ ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే రిపేర్ చేసే వెసులుబాటు ఉన్నా రాజకీయ లబ్ధి కోసం స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారో హరీశ్‌రావు చాలా చకగా వివరించారని, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కాళేశ్వరంపై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలు, వాస్త్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ కర్తవ్యమని ఎర్రబెల్లి వివరించారు.