ములుగు, జూలై 6(నమస్తే తెలంగాణ): ములుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, అన్ని అర్హతలున్నా తనకు ఇంటి కేటాయింపులో తీరని అన్యాయం జరిగిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన పాపానికి ఆ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి బెదిరింపులకు దిగడమే కాకుండా పోలీసులకు మౌఖిక ఫిర్యాదు చేయటంతో పోలీసులు ముందూవెనుకా ఆలోచించకుండా సదరు యువకుడిని భయోత్పాతానికి గురిచేయడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
తల్లీదండ్రీలేని ఆ 29 ఏండ్ల యువకుడు చుక్క రమేశ్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. సోమవారం ములుగు జిల్లాకేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, చల్వాయిలో మృతు ని కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ కార్యచరణ ప్రకటించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో ఈ నెల 31 వరకు పోలీసు నిషేధాజ్ఞలు విధించింది. పోలీస్ యాక్ట్నూ ప్రయోగించింది.
తమ శాంతియుత నిరసనను ప్రభుత్వం కావాలనే అణచివేయాలని చూస్తున్నద ని, ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు అమలు చేసినా తాము ముందుగా ప్రకటించిన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ తేల్చిచెప్పింది. దీంతో ఇందిరమ్మ అక్రమ కేటాయింపుల బాగోతం బయటపడుతుందని భావించిన ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉసిగొల్పింది. బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ప్రకటించిన రోజే తామూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోమవారం ములుగులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొన్నది.
బీఆర్ఎస్ పార్టీ సోమవారం తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని కావాలనే అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నం చేస్తున్నదని ములుగులో చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై మంత్రుల పర్యటన నెపంతో పోలీసులను ఉసిగొలిపి ఎక్కడిక్కడ నిర్బంధించాలని పథ కం వేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. అందులో భాగంగానే మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం ములుగులో మకాం వేశారనే ప్రచారం సాగుతున్నది.
వెంకటాపూర్(నూగు రు) మండలంలో అప్పుడెప్పుడో మక్కజొన్న రైతులకు పరిహారం అందివ్వాల్సిన కార్యక్రమాన్ని సోమవారమే నిర్వహించాలని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును మంత్రి సీతక్క ఆహ్వానించారని చెబుతున్నా రు. మరోవైపు ములుగు జిల్లావ్యాప్తంగా అన్ని మం డలాల్లోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ‘ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించొద్దు.
ఒకవేళ నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తాం’ అని పోలీసులు బెదిరిస్తున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు జిల్లాలోని అన్ని మండలాల్లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు నిఘాపెట్టారు. వారి కదలికలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ములుగులో ఏం జరుగుతుందన్న ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.