అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. వరంగల్ తూర్పు, పశ్చిమం, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. హుస్నాబాద్, మంథని, ఇల్లందు ‘హస్త’గతమవగా, హుజూరాబాద్, భద్రాచలంలో గులాబీ విజయదుందుభి మోగించింది.
వరంగల్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండు స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో గులాబీ జెండా రెపరెపలాడగా, వరంగల్ తూర్పు, పశ్చిమం, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, ములుగులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. పాలకుర్తిలో మామిడాల యశస్వినిరెడ్డి, డోర్నకల్‌లో జాటోతు రాంచంద్రునాయక్, మహబూబాబాద్‌లో భూక్య మురళీనాయక్, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, పరకాలలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పశ్చిమలో నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ తూర్పులో కొండా సురేఖ, వర్ధన్నపేటలో కె.ఆర్.నాగరాజు, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు, ములుగులో ధనసరి అనసూయ(సీతక్క) గెలిచారు. మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హుస్నాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కోరం కనుకయ్య గెలిచారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి, భద్రాచలంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తెల్లం వెంకటరావు విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో ముగ్గురు మహిళలు కొండా సురేఖ, ధనసరి అనసూయ, మామిడాల యశస్వినిరెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి జిల్లాలో ఐదుగురు విజయం సాధించారు. వీరిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డి, భూక్య మురళీనాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజు ఉన్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాగా కొండా సురేఖ ఐదోసారి, దుద్దిళ్ల శ్రీధర్‌రాబు ఐదోసారి, కడియం శ్రీహరి నాలుగోసారి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి నాలుగోసారి, ధనసరి అనసూయ, కోరం కనుకయ్య రెండోసారి, తెల్లం వెంకట్రావు మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. హుజూరాబాద్‌లో ఏడుసార్లు గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.