మహబూబాబాద్ రూరల్, జూన్ 5 : రాష్ట్రంలో నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. బుధవారం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన పడొద్దని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందన్నారు. గెలుపు, ఓటములు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని, గతంలోనూ ఈ ఘటనలు అనేకం జరిగాయని, పేదల పక్షాన ఉండి పోరాడాలన్నారు. ఎవరైనా సరే ప్రజల తీర్పును శిరసావహించాలని, దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు న్యాయం జరిగేలా పరిపాలన కొనసాగించాలన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయిందన్నారు. ప్రజల పక్షాన సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలకు మద్దతుగా నిరసనలు చేస్తామన్నారు. రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్ అన్నివర్గాలకు సౌకర్యాలు కల్పించారని, ప్రస్తుత ప్రభుత్వం అదేతీరుగా పేదలకు స్కీమ్‌లను అమలు చేయాలన్నారు. కవిత గెలుపు కోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు రెండు నెలలు అలుపెరుగని పోరాటం చేశారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, బీరవెల్లి భరత్‌కుమార్, మార్నేని వెంకన్న, తేళ్ల శ్రీను, లునావత్, అశోక్‌నాయక్ పాల్గొన్నారు.