నర్సంపేట(ఖానాపురం), జూలై 12 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖానాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడేది రౌడీ భాషా, బజారు భాషా అని మండిపడ్డారు. గోదావరి నదిలో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకుండా ఎండబెడుతున్నాడని ఆరోపించారు. నీళ్లు అడిగిన ప్రతిపక్ష నాయకులపై సీఎం రేవంత్‌రెడ్డి రౌడీలా మాట్లాడుతున్నాడన్నారు.
ప్రతిపక్ష నాయకుల రక్తాన్ని పంటలపై చల్లుతా అనడం సరికాదన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులను అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్న ముఖ్యమంత్రి తీరును పెద్ది తీవ్రంగా ఖండించారు. నర్సంపేట నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉండి సాగు నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. రామప్ప-పాకాల, రామప్ప- రంగాయ చెరువు ప్రాజెక్టులకు ఒక బటన్ నొకితే వేలాది ఎకరాలకు సంపూర్ణంగా సాగు నీరు అందే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిగానీ కనీసం నారుమడికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఎల్‌నినో ప్రభావం ఉందని ముం దస్తుగా శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ హయంలో పాకాల సరస్సులో 13 ఫీట్లకు లోపు నీళ్లు ఉన్నా నారుమడులకు నీళ్లు ఇచ్చామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, వాటి ఉపయోగంపై పూర్తిస్థాయి అవగాహన ఉండడం వల్లే గత ప్రభుత్వంలో రైతులకు సరిపడా నీళ్లు అందాయన్నారు. రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే మాధవరెడ్డి రైతులకు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి నదిలో నీరు ఉన్నప్పటికీ అసమర్థ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల వల్ల రైతులకు కరువు వచ్చాయన్నారు. ప్రస్తుతం రామప్ప చెరువులో 26 ఫీట్ల నీటి నిల్వ ఉందని, పాకాల ప్రాజెక్టు మోటార్లు ఎందుకు నడపడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వందల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు ఇలాంటి కరువు పరిస్థితుల్లో రైతులకు ఉపయోగపడకపోవడం ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనమన్నారు. పాకాల, రంగయ్య చెరువు ప్రాజెక్టుల మోటర్లు ఆన్ చేయకుంటే కాంగ్రెస్ నాయకులపై రైతులు తిరగబడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ దాసరి రమేశ్, ముఖ్య నాయకులు జాటోత్ సదర్లాల్, తక్కళ్లపెల్లి బాబురావు, అజహర్, బాలునాయక్, కోరె సుధాకర్, వల్లెపు శ్రీనివాస్, సమ్మయ్య, ఆబోతు అశోక్, గుగులోత్ బాలు, మచ్చిక అశోక్, పూర్ణచందర్, బాలకిషన్, లింగమూర్తి, యాకయ్య, రాజశేఖర్, రవి, రాము, చాగంటి వెంకటేశ్వర్లు, రాజు, వెంకన్న, భిక్షపతి, హుస్సేన్, నాగరాజు పాల్గొన్నారు.