అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలకు ఆరు నెలలైనా దిక్కేలేదు. అందులో బస్సు తప్ప అన్నీ తుస్సయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన గురువారం భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ సన్నాహక సమావేశాల్లో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కాంగ్రెస్ సర్కారు అన్ని వర్గాలను మోసం చేస్తోందని, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వలేమని చేతులెత్తేసిందన్నారు. ఉపాధ్యాయుల మూడు డీఏలకు ఇప్పటికీ అతీగతీలేదన్నారు. ప్రభుత్వం రైతులను గోస పెడుతున్నదని, రాష్ట్రంలో వడ్లు కొనే పరి స్థితి లేదని, కొనుగోలు కేంద్రాల్లో నే వడ్లకు మొలకలు వస్తున్నాయని అన్నారు. అసలైన మార్పు జరిగేలా ఓటర్లు తీర్పు ఇవ్వాలని, ప్రశ్నించే గొంతుక రాకేశ్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు.
అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు, 13 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లను చూపిస్తూ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి 180 రోజులు గడుస్తున్నా హామీల అమలును తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి ఆరు గ్యారెంటీలు అమలయ్యాయని అన్నడు.. అంటే ఆయన కు ఏ మాత్రం అవగాహన ఉందో అవగతమవుతుందని అన్నా రు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకమని, మొదటి నుంచి ఈ సీటు మనమే గెలిచామని, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి భారీ మెజార్టీ ఇచ్చి రెండు సార్లు గెలిపించారని, అదే మెజార్టీ రాకేశ్‌రెడ్డికి ఇచ్చి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు దేవుడి పేరు చెప్పి ఒకరు, దేవుడిపై ఒట్లు పెట్టి మరొకరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను, రూ.2లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని, ఈ దఫా ఎన్నికల్లో పోటీచేయనని చేసిన సవాల్‌ను ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి స్వీకరించ లేదని, ఆయన నైజాన్ని విద్యావంతులు గుర్తించాలన్నా రు. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ప్రకటించారని, తెలంగాణలో 99 శాతం దొడ్డు వడ్లు పండిస్తున్న రైతాంగానికి మొండిచేయి చూపారన్నారు.
జైశ్రీరాం లాంటి సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.3వేల చొప్పున మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారని, ఇక కాంగ్రెస్ ఇచ్చే బోనస్ ఎవరికి వర్తిస్తుందన్నారు. ఒక టీవీ రిపోర్టర్‌గా అనాలసిస్ చేసే తీన్మార్ మల్లన్న గొంతు నిరుద్యోగులకు భృతి విషయంలో ఉందుకు మూగబోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు, నీళ్లు సక్రమంగా ఇవ్వలేదని, కనీసం పండించిన పంటనూ కొనుగోలు చేయడం లేద ని, ఈ విషయమై పట్టభద్రులైన రైతులు నిలదీయాలన్నారు. ఎన్నికల సమయంలో రూ.2500 నిరుద్యోగ భృతి ఇస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి మేం ఇస్తాం అని చెప్పలేదు.. అని నిండు సభలో అబద్ధమాడి నిరుద్యోగులను మోసం చేశారని, నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వలేమంటూ చేతులెత్తేశారని గుర్తు చేశారు. ప్ర జలు కాంగ్రెస్ మోసాలను గమనిస్తున్నారని అన్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని, ఆరు నెలలైనప్పటికీ అంగుళం కూడా జరుగలేదన్నారు. పెట్రోల్, డీజి ల్, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి వాత పెట్టాలన్నారు. తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ను బలపర్చాలని అన్నారు. కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్ట అని, దాన్ని రాజ ముద్ర నుంచి తొలగించాలని సీఎం కుట్రలు చేస్తే వరంగల్ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే బీఆర్ఎస్ వెంటాడుతుందని, నిరుద్యోగుల పక్షాన పోరాడుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవ డం సిగ్గు చేటన్నారు. ఈ ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చింది, నియామక ప్రక్రియను పూర్తి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగాలు తామే ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటున్న తీరును నిరుద్యోగ యువత గుర్తించాలన్నారు. అధికారంలోకి రాగానే 20వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటిస్తామన్న హామీ, నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. పరీక్షల ఫీజులు పెంచబోమని చెప్పి రూ.400 ఉన్న టెట్ ఫీజును రూ.2 వేలకు పెంచారని, చాయ్ తాగినంత టైంలో కస్తూర్బా టీచర్లను పర్మినెంట్ చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డికి ఇప్పటి వరకు తీరిక దొరకలేదా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలన లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమ లు చేయడం లేదని అన్నారు. త్వరలోనే కరెంట్, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోందని, ప్రజల సంక్షేమానికి కోతలు పెట్టి ఆకాంక్షలకు వాతలు పెట్టాలని చూస్తు న్న తీరు రేవంత్ రివర్స్ గేర్ పాలనకు అద్దం పడుతోందన్నారు.
మన నీళ్లు కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు తరలించే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ఆగడాలపై మౌనం వహిస్తున్న రేవంత్‌రెడ్డి తీరుపై పోరాడాలంటే కేవ లం బీఆర్ఎస్కే సాధ్యమన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కుట్రలు పన్నుతున్నారని, వీటిని అడ్డుకుని తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే రాకేశ్‌రెడ్డిని మండలికి పంపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలను ఆమోదించే వారు ఆ పార్టీకి ఓటు వేస్తారని, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రైవేట్ ఉద్యోగులు పక్షాన పోరాడే వారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి ఓటు వేయాలని హరీశ్ రావు పట్టభద్రులను కోరారు. కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. మనం మేల్కొని కొట్లాడకపోతే రిజర్వేషన్లు పోతాయి. ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజన బిడ్డలు డాక్ట ర్లు, ఇంజినీర్లు అయ్యారు. గిరిజన మేధావులు మేల్కొనాలని హరీశ్‌రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గం సస్యశ్యామలం చేసేందుకు పాలేరు, ఆకేరు, మున్నేరు వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సింగరేణిలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఈ ఎన్నికల ను చాలెంజ్‌గా తీసుకోవాలని, ప్రతి పట్టభద్రుడైన కార్మికున్ని ఓటు అడగాలని, టీబీజీకేఎస్ వెంట తాముంటామని అన్నారు.
ఈ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే పట్టభద్రుల ఆత్మగౌరవం పెంచేలా పని చేస్తా. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపిస్తే ఓరుగల్లు యువత, విద్యావంతులు గెలిచినట్టే. బూతులు మాట్లాడే, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడి అడ్డదారిన కోట్లు సంపాదించుకునే వ్యక్తులను పెద్దల సభకు పంపించవద్దు. ఇప్పటి వరకు మేధావి వర్గం మాత్రమే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పెద్దల సభకు వెళ్లారు. ఆ పరంపరను మళ్లీ కొనసాగించి బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించే దిశగా సంపూర్ణ సహకారం అందించాలి. నేను గెలిచాక వచ్చే గౌరవ వేతనంలో ప్రతి పైసా గ్రంథాలయాల అభివృద్ధికి, నిరుద్యోగుల సహకారానికి వినియోగిస్తా. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురొని అమెరికాలో లక్షల్లో జీతం వచ్చే జాబ్‌ను వదిలి పెట్టి ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. నిరుద్యోగుల తరఫున పోరాడుతా.
మీడియా పేరుతో, ప్రజల గొంతుకను అని చెప్పి సొంత ఆస్తులు సంపాదించుకోవడానికి అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గొంతు కాంగ్రెస్ సాగిస్తున్న అబద్ధపు ప్రచారాలపై నిలదీయకుండా మూగబోయింది. ఇలాంటి చీటర్‌ను చిత్తుగా ఓడించాలి. కాంగ్రెస్‌కు బ్లాక్ మెయిలర్, బీజేపీకి అసమర్థ అభ్యర్థులు ఉన్నారు. ఉన్నత విద్యను చదివి కొన్నేళ్లుగా ప్రజా సేవలో నిమగ్నమై ప్రజల గొంతుకగా పేరు తెచ్చుకున్న యువకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించేలా పెద్దల సభలో వాణిని వినిపించి ఉద్యోగ ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాల పక్షాన పోరాడే సత్తా ఉన్న రాకేశ్‌రెడ్డిని ఆశీర్వదించాలి.
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రజల జీవితాలను చీకటిమయం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి, పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ నాయకులే ఓడించాలని చూస్తున్నారని అన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా అందరు మంత్రులను బ్లాక్ మెయిల్ చేసిన నీచుడన్నారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ అనేక సార్లు జైలు జీవితం అనుభవించిన ఖైదీ తీన్మార్ మల్లన్నను చట్టసభకు పంపితే పట్టభద్రులకు న్యాయం జరగదన్నారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, వాసుదేవారెడ్డి, మెట్టు శ్రీనివాస్, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, పసుమర్తి సీతారాములు, డాక్టర్ పీ సోమేశ్వర్రావు, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీలు శ్రీనివా స్, ఎన్నమనేని శ్రీనివాసరావు, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, కుర్ర శ్రీనివాస్, నలమాస ప్రమోద్, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, నేతలు గండ్ర గౌతంరెడ్డి, సాంబారి సమ్మారావు, బుర్ర రమేశ్, పా లిక రఘుపతి గౌడ్, బుర్ర రాజు గౌడ్, మహబూబాబాద్ జడ్పీ అధ్యక్షులు బిందు, వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఓడీసీ ఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, గుగులోత్ వెంకన్న, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద పాల్గొన్నారు.