వర్ధన్నపేట/రాయపర్తి, ఏప్రిల్ 21 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీ కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుతూ కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన ట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రజాసంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేకపోతోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో భూములకు విలువ పెరిగిందన్నారు. కాంగ్రెస్ వచ్చాక భూముల రేట్లు పూర్తిగా పడిపోయాయన్నారు. పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందుతున్న కాంగ్రెస్‌ను ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు.
తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారని వివరించారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ నెల 22న సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారపెల్లి సుధీర్‌కుమార్ నామినేషన్ వేయనున్నందున పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గోపాల్‌రావు పాల్గొన్నారు. అలాగే, రాయపర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి కూడా ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై మాట్లాడారు. అబద్ధాల కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. మండల ఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాల్‌రావు, ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకుడు సుధీర్‌రెడ్డి, మధు పాల్గొన్నారు.