ధర్మసాగర్, అక్టోబర్ 16 : ‘పార్టీని నమ్ముకోవడమే మా పాపమా? కాంగ్రెస్ పటిష్టతకు కష్టపడుతుంటే కనీ సం గుర్తింపునివ్వరా? ఇందిరమ్మ కమిటీల్లో మాకు స్థానం కల్పించరా? నిన్నగాక మొన్నచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన వర్గీయులకేమో అందలమా?’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. ధర్మసాగర్ మండలం కరుణాపురం జాతీయ రహదారిపై మండల కో ఆర్డినేటర్ కొత్తపల్లి భిక్షపతి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బుధవారం రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పదేళ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నామన్నారు. కాగా, ఎమ్మెల్యే కడియం వర్గీయులు గ్రామాల్లో జరిగే కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల సమాచారం తమకు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఉన్నా ఎమ్మెల్యే వర్గీయులే ముందువరుసలో ఉంటూ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. మండలంలోని ఎమ్మెల్యే వర్గీయులు ఓ గ్రామంలో కూర్చుని ఇందిరమ్మ కమిటీలు వేశారని, దీన్ని నిరసిస్తూ రాస్తారోకో చేశామని పేర్కొన్నారు. కమిటీల్లో ఎమ్మెల్యేకు అనుకూలమైన వ్యక్తుల పేర్లు చేర్చారని విమర్శించారు.
దీనిని రద్దు చేయాలని, అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాతే కమిటీలు వేయాలన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నియోజకవర్గ ఇన్చార్జి సింగాపురం ఇందిర తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. కాగా, విషయం తెలుసుకున్న ఇందిర.. నాయకులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో చిల్పూర్ దేవస్థానం డైరెక్టర్ బొలెడ్ల వికాస్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు భైరపాక దివాకర్, బీసీ సెల్ మండలాధ్యక్షుడు పెసరు వెంకటయ్య, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు జూమీలాల్, శ్రీనివాస్, శశికుమా ర్, కుర్సుపల్లి ప్రశాంత్, కనకం ప్రవీణ్ పాల్గొన్నారు.