జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ)/టేకుమట్ల : భూపాలపల్లి నియోజకవర్గంలో కాం గ్రెస్‌లో వేరు కుంపటి రాజుకుంటున్నది. గత కొంత కాలంగా పాత కాపుల్లో నెలకొన్న అసంతృప్తి కట్టలు తెంచుకున్నది. పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వర్గాలు సృష్టిస్తున్నారని, పార్టీ కోసం పని చేసేవారిని పక్కన పెడుతున్నారనే ఆరోపణలు కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్నా యి. గతంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మరో సీనియర్ నేతకు ఎదురైన పరాభవంతో బయటపడిన ఈ విభేదాలు తాజాగా మరోమారు బహిర్గతమయ్యాయి. ‘నా ప్రభుత్వం నన్ను క్షమించాలి’ అని జిల్లాలోని టేకు మట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సతీశ్ ఒక రోజు ముందుగానే సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఇసుక అక్రమ దందాపై పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించడం జిల్లాలో సంచలనంగా మారింది.
గతంలో నేతల ఇసుక అక్రమ దందాపై అధికారులు అధికార పార్టీ నేతలు డంప్ చేసిన అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేసి వేలం వేశారు. అప్పటి నుంచి రగులుతున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారి కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డెక్కే వరకు వచ్చింది. అధికారులు పార్టీలోని ఒక వర్గానికి మాత్రమే సపోర్టు చేస్తున్నారని, మిగిలిన నాయకుల ట్రాక్టర్లను పోలీసులకు పట్టిస్తున్నారని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ధర్నాతో పార్టీలో గ్రూపు తగాదాలు బట్టబయలయ్యాయని చర్చించుకుంటున్నారు.
ధర్నాను ఆపేందుకు చాలా ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమార్కులు ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యేను, ప్రభుత్వాన్ని దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. పది ట్రిప్పుల అనుమతితో వంద ట్రిప్పులు కొడుతున్నారు. నియోజకవర్గాలు దాటిస్తున్నారు. టేకుమట్ల మండల ట్రాక్టర్ యజమానులు ఇసుకను తరలిస్తే కేసులు పెట్టే పోలీసులు ఇతర మండలాల ట్రాక్టర్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదని సతీశ్ ప్రశ్నించారు. ఇదిలాఉండగా ధర్నా జరిగిన గంటలోపే టేకుమట్లకు చెందిన ఓ కాంగ్రెస్ నేతకు చెందిన ఇసుక ట్రాక్టర్‌ను గోరికొత్తపల్లి పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్ఐకి ఫోన్ చేసినా విచారణ పేరిట సుమారు 4 గంటలు జాప్యం చేసి వదిలిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.