దేవరుప్పుల, సెప్టెంబర్ 12 : తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్షనిజానికి, రౌడీ రాజకీయాలకు తెరలేపుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన గూండాలతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న కౌశిక్‌రెడ్డిని టార్గెట్ చేసి దాడులు చేయించడాన్ని చూస్తే ఇందిరమ్మ రాజ్యంలో ఎమ్మెల్యేకు రక్షణ కరువైనట్లు స్పష్టమవుతున్నదన్నారు. ఓ వైపు కౌశిక్‌రెడ్డిని ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచగా, మరోవైపు పోలీసుల ముందే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు ఇంటిపై దాడులు చేయించడాన్ని చూస్తే తెలంగాణలో ఫ్యాక్షన్ సంప్రదాయానికి, రౌడీయిజానికి బీజాలు పడ్డట్టు అర్థమవుతున్నదన్నారు.
ఇది కచ్చితంగా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన దాడేనని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి ఉడుత ఊపులకు భయపడేది లేదని, ఇంతకుమించిన ప్రతిఘటన ఉంటుందని మరవొద్దన్నారు. తెలంగాణ రాజకీయాలంటే ఇన్నాళ్లూ క్రమశిక్షణకు గీటురాయని దేశంలోని ఇతర రాష్ర్టాలు భావించేవని, ఈ సంఘటనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల దేశానికి ఏం సంకేతాలు ఇస్తున్నదని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తక్కువ సమయంలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, రానున్నది కేసీఆర్ ప్రభుత్వమని దాడుల లెక్కల తేల్చుతామన్నారు.