ములుగు, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల వేళ ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల భయం పట్టుకుంది. కుటుం బ సభ్యులు, బంధువులకు దగ్గరుండి మంజూరు చే యించుకున్న నేతలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మా ర్చుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మాకొద్దంటూ అధికారులకు లేఖలు సమర్పిస్తున్నారు. తమ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారనే ఆందోళన ఒకవైపు.. పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందనే గుబు లు మరోవైపు ఉండడంతో వెనకడుగు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగపేట మండలం బుచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటూరి నాగయ్య ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయిస్తానంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. దీంతో మంత్రి సీతక్క ఆదేశాలతో పార్టీ మండలాధ్యక్షుడు అతడిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
ఇది మరువక ముందే ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తన తమ్ముడి భార్య పేరుపై మంజూరు చేయించిన ఇందిరమ్మ ఇల్లు వద్దంటూ శుక్రవారం ఎంపీడీవోకు లేఖ అందించారు. జిల్లాలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి కాకుండా కాంగ్రెస్ నేతలు, వారి బంధువులు, అనుచరులకు మంజూరు చేయించారని ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వెళ్తే ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతోనే సదరు నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఇతడి బాటలోనే జిల్లాలోని ఆయా మండలాల్లో ఇందిరమ్మ ఇండ్లు తమ వారికి ఇప్పించుకున్న నాయకులు ఎంచుకున్నట్లు చర్చ జరుగుతున్నది.
ప్రస్తుతం తమ తతంగాన్ని గమనిస్తున్న ప్రజలు రచ్చ రచ్చ చేస్తే మంత్రి చర్యలు తీసుకుంటుందనే భయంతోనే వారిని ఏమార్చేందుకు ఈ దారిలో వెళ్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై ములుగు ఎంపీడీవో రామకృష్ణను వివరణ కోరగా మున్సిపాలిటీ పరిధిలోని ఓ మహిళ ఈ నెల 20న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టుకునేందుకు సిద్ధంగా లేనని, తన మంజూరు పత్రాన్ని రద్దు చేయాలని దరఖాస్తు ఇచ్చిందని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమకు ఓటుతో బుద్ధి చెబుతారనే ఆందోళనతోనే నేతలు ఇలాంటి నిర్ణయానికి వచ్చారనే చర్చ జరుగుతున్నది. అయితే ఇలాంటి కుయుక్తులను ప్రజలు నమ్ముతారా? లేక ఓటుతో బుద్ధి చెబుతారా? అనేది వేచి చూడాల్సిందే.