జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమడలేక, ప్రజలకు సమాధానం చెప్పు కోలేక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపిన రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేతలు తిరుగుబాట పట్టారు. సొంతగూటికి పయనమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన మరునాడే భూపాలపల్లి మండలం కొత్తపల్లి (ఎస్ఎం) గ్రామానికి చెందిన సర్పంచ్ ఎల్లగొండ పద్మ తిరుపతి దంపతులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు.
అలాగే శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆ ర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మున్సిపాలిటీ పరి ధిలోని 30 వార్డులకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సంబధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచే బస్తీబాట ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుదా మని చెప్పారు. కాగా కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి సొంతగూటికి చేరుకున్నారు. అలాగే సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు బానోత్ రాజు నాయక్ బీఆర్ఎస్ లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు సైతం మళ్లీ గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది.