BRS Leaders | కాసిపేట, అక్టోబర్ 14 : కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ నేతలు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. సోమవారం కాసిపేటలో కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ పై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు అనడం హాస్యాస్పదమని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని రుజువు చేస్తే కాసిపేట అంబేద్కర్ చౌక్ దగ్గర ముక్కు నేలకు రాస్తామని, అదే మేము ఆధారాలతో సహా రేషన్ కార్డులు ఇచ్చినట్టు నిరూపిస్తే ఆరోపణలు చేసిన కాసిపేట మండల కాంగ్రెస్ నేతలు రాస్తారా..? అని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని, అందులో జరుగుతున్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం బాకీ కార్డుల పంపిణీ చేస్తుందని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, బీఆర్ఎస్ ఉనికి గట్టిగా ఉంది కాబట్టే కాంగ్రెస్ ఉనికికి ఏడ దెబ్బ వస్తుందో అని ఆదరాబాదరాగా కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టినట్టు కనపడుతుందన్నారు.
ఓడిపోతామనే భయంతోనే గత 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం గత కేసీఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 లక్షలకుపైగా రేషన్ కార్డులు జారీ చేశారని చెప్పారని గుర్తు చేశారు.
మోసపూరిత హామీలు ఇచ్చి..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రధాన ప్రతి పక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో ఎంత బాకీ పడ్డదని, బాకీ కార్డుల ద్వారా గుర్తు చేస్తుందన్నారు. అది జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్ నేతలు కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం
రెండు జోడు ఎద్దులలాగా ముందుకు సాగాయని, అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఏ మూలపోయి అడిగినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటున్నారన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు అబద్ధాల ప్రచారాలకు స్వస్తి పలికి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి మోటూరి వేణు, మాజీ సర్పంచ్ అజ్మీర తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు పెంద్రం హన్మంతు, ఏనుగు సుధాకర్ రెడ్డి, సుమన్ గౌడ్ తదితరులున్నారు.