పాలకుర్తి రూరల్, జనవరి 27 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన పాలకుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవని.. హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ను విజయం వైపు నడిపించాలన్నా రు. పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రక్షాళన చేస్తామని, పార్టీ ద్రోహులను ఉపేక్షించేది లేదన్నారు. గత ప్రభు త్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను ఆపితే ధర్నాలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషన్లను ఇచ్చిందని, కాంగ్రెస్‌వి నిజంగా 420 హామీలనేనని ఎద్దేవా చేశారు. అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ ఎక్కడ అని ప్రశ్నించారు. రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు, రైతు బీమా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే ప్రజాపోరాటం చేస్తామన్నారు. 50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని.. 2028లో మళ్లీ బీఆర్ఎస్దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓడిపోవడం బాధాకరమన్నారు. రూ. వేల కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. పాలకుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో కసిగా పనిచేయాలని సూచించారు. పాలకుర్తి నియోజకవర్గంలో 50వేల మెజార్టీ తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీలవి మిలాఖత్ రాజకీయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరు పార్టీల రహస్య మైత్రి బయటపడిందన్నారు. గవర్నర్ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను ఎమ్మెల్సీగా ఎలా అంగీకరించారో గవర్నర్ చెప్పాలని ప్రశ్నించారు. కోదండరాం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేశారని గుర్తుచేశారు. దాసోజు శ్రావణ్, ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే గవర్నర్ అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల మిలాఖత్ రాజకీయాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం, మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రంగనాయక సాగర్‌పై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు హాస్యాస్పదమన్నారు.
సీఎం రేవంత్, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. అక్రమ కేసులకు, అవిశ్వాసాలకు భయపడేది లేదన్నారు, అధికారం శాశ్వతం కాదని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. రైతుబంధు 11సార్లు వేశామన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో లక్షా 28వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పంటలకు నీళ్లిచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు రైతుబంధు రాలేదని అడిగితే మంత్రులు చెప్పుతో కొడుతామని అంటున్నారని మండిపడ్డారు. ప్రజలు బీఆర్ఎస్, కేసీఆర్ వెంటే ఉన్నారని, తెలంగాణ ప్రజలు తెలివైనవారని, ఎంపీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల మనిషి దయన్న ఓటమి బాధాకరమని, పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎర్రబెల్లికే దక్కిందన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని, గెలుపు ఓటములు సహజమన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో 50వేల మెజారిటీ సాధించడం ఖాయమన్నారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేయాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గానికి రూ. వేల కోట్ల నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. మంజూరైన నిధులను అడ్డుకుంటే ధర్నాలు తప్పవని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి గడ్డ నుంచే మరోసారి పోటీ చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చేయడం సాధ్యం కాదని, వచ్చిన నిధులను అడ్డుకోవద్దని సూచించారు. త్వరలో గ్రామాల వారీగా అభివృద్ధి పనుల నివేదిక అందజేస్తానన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలను 100రోజుల్లో అమలు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు మాట్లాడుతూ వరంగల్ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు పాలకుర్తి నియోజకవర్గ ఓటమిపై సమీక్ష నిర్వహించుకోవాలన్నారు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, జినుగు అనిమిరెడ్డి, ధరావత్ జ్యోతి, తూర్పాటి ఆంజయ్య, ఈదూరు ఐలయ్య, జడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాసరావు, మంగళంపల్లి శ్రీనివాస్, పల్లా సుందర్రామిరెడ్డి, రంగు కుమార్, శ్రీరాం సుధీర్‌కుమార్, కేలోత్ సత్తమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, తీగల దయాకర్, వసుమర్తి సీతారాములు, ఏలె సుందర్, వంగ అర్జున్, ఈదునూరి నర్సింహారెడ్డి, వీ రాంచంద్రయ్య శర్మ, ముత్తినేని శ్రీనివాస్, పేరం రాము, దీకొండ వెంకటేశ్వర్రావు, పూస మధు, మాచర్ల ఎల్లయ్య, వీరమనేని యాకాంతారావు, కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, ఎర్రబెల్లి వినయ్‌రావు, పసునూరి మధు, విక్రంరెడ్డి, గడ్డం రాజు పాల్గొన్నారు.