హనుమకొండ/ హనుమకొండ చౌరస్తా, జూన్ 9 : అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు ఊర్లకు పోతే ఆ పార్టీ వాళ్లను తన్ని ఉరికిస్తరని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. మంగళవారం కాపువాడలో ని శ్రీమాతా గార్డెన్లో పులి రజినీకాంత్ అధ్యక్షతన 7, 10 డివిజన్లు, వడ్డేపల్లిలోని ఎన్వీ కన్వెన్షన్‌లో 58, 59, 60 డివిజన్ల బూత్‌లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలని, ఎస్ఐఆర్పై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ప్రజలను మోసం చేసి కాం గ్రెస్, బీజేపీ గద్దెనెక్కాయన్నారు.
బీజేపీ తమకు అనుకూలంగా లేని ఓటర్లను తొలగిస్తున్నదని, అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలు, మతాలను గౌరవిస్తూ వారి సంక్షేమానికి కృషి చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ కబ్జాలు చేయడం వల్లే నగరానికి వరద ముంపు వచ్చిందని, 7వ డివిజన్లో ఓట్లు, కోట్లు తదితర చాలా కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదని, నాయస్థానంపై తమకు నమ్మకం ఉన్నదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమష్టిగా కృషి చేద్దామని, పార్టీ బలోపేతానికి, సభ్యత్వ నమోదుకు కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నామన్నారు.
వచ్చే నెల నుంచి డివిజన్లలో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కష్టకాలంలో వెంట ఉన్నోళ్లే మనవారని, పార్టీలోకి కొత్త రక్తం వస్తున్నదని, మరింత ఉత్సాహంగా పనిచేద్దామన్నారు. త్వరలో సభ్యత్వ నమోదు చేపడతామని, పార్టీ కోసం పనిచేసిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసులైన వారికి రూ.ఐదు లక్షలు, దెబ్బలు తాకిన వారికి రూ.లక్ష అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేందుకు వరంగల్ నుంచే శ్రీకారం చుడుదామని దాస్యం పిలుపునిచ్చారు. సమావేశాల్లో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఇమ్మడి లోహిత, కేశబోయిన అరుణ, మిడిదొడ్డి స్వప్న, ఉడుతల సారంగపాణి, డివిజన్ ఇన్చార్జులు రఘు, సత్యపాల్‌రెడ్డి, విజయ్, సీనియర్ నాయకులు రాజన్న, నయీముద్దీన్, ఎండీ ఖలీల్, హైమావతి, సుదర్శన్, ఈశ్వర్, పొదిలి అనిల్, వరుణ్, సుధాకర్, రవీందర్, నీలం సుహాస్, రాజు, మధు, చిన్న, ఉదిత్, స్నేహిత్, సురేశ్, నాగరాజు, సంతోష్ పాల్గొన్నారు.