వరంగల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్‌లో ‘కొండా’ దుమారం తారాస్థాయికి చేరింది. మూడు రోజులుగా రోజుకో సంచలనం అన్నట్టుగా పరిణామాలు వేటికవే పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. అటు రాష్ట్రంలో, పార్టీలో, ప్రభుత్వంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మేడారం జాతర నేపథ్యంగా మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానను తలపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వారి కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవటం ఆసక్తిని రేపింది.
ఒక దశలో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలూ వినిపించాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ కావడం వాటికి బలం చేకూర్చాయి. అయితే, భేటీ అనంతరం కొండా సురేఖ స్పందించడంతో అవన్నీ ఊహాగానాలేనని తేలిపోయింది. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌లో కొండా అనుకూలవర్గం, వ్యతిరేకవర్గం ఈ రెండిటితోనూ ఏఐసీసీ పరిశీలకులు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఇలా వరుసగా మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కేడర్‌లో ఉత్కంఠను రేపాయి.
మేడారం పనుల టెండర్ నేపథ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో అనేక మలుపులు తిరుగుతున్నాయి. టెండర్ వ్యవహారం లీకైందని, అందుకు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ కారణమనే అభియోగంతో ప్రభుత్వం అతన్ని తొలగించింది. అయితే, సుమంత్‌ను తొలగించేందుకు తక్షణ కారణంగా అది కనిపిస్తున్నా వాస్తవానికి ఇంకా వేరే అంశాలున్నాయని మంత్రి సురేఖ కూతురు సుస్మిత బుధవారం రాత్రి చేసిన ఆరోపణలతో తేలింది. వాటిపై లోతుగా విశ్లేషిస్తే తప్ప అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక మాజీ ఎమ్మెల్సీ, మంత్రి సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు తానెవరికీ టార్గెట్ కాదని, తనకెవరూ కాదంటూనే గతంలో చేసిన వ్యాఖ్యలనే ఏకరువు పెట్టారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనుల కోసం తన దగ్గరికి వచ్చిన రోజులతో పాటు వేం నరేందర్‌రెడ్డి తన సాయం కోసం వచ్చిన సందర్భాన్ని గుర్తుచేశారు.
ఇక కొండా దంపతుల కుమార్తె సుస్మిత ఒక అడుగు ముందుకేసి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి తదితరులు కావాలనే తమ తల్లిదండ్రులను అణచివేస్తున్నారని, వారికి నాయకత్వం వహిస్తున్నది సీఎం రేవంత్‌రెడ్డి, సర్కార్ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అని ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంపై వేం నరేందర్‌రెడ్డి కన్నేయడమే అందులోని ఆంతర్యమని, అందుకు గతంలో ఆయన అక్కడి నుంచి పోటీచేసిన ఉదంతాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సైకిల్ కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొన్నది.
డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండు వేర్వేరు సమావేశాలు జరిగాయి. ఈ రెండు సమావేశాలకు పార్టీ ఏఐసీసీ పరిశీలకులుడు నవజ్యోత్ పట్నాయక్ హాజరుకావడం గమనార్హం. ఉదయం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఆధ్వర్యంలో ఆయన వర్గీయుల బలప్రదర్శన, అభిప్రాయ సేకరణ, అలాగే సాయంత్రం వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, బస్వరాజ్ శ్రీమాన్ సహా పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. మొత్తంగా కొండా దంపతులు, వారి వ్యతిరేక వర్గానికి మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి.