హనుమకొండ, అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండడంలేదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి నగర అభివృద్ధి కోసం కొత్తగా ఏ పనులు చేపట్టలేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో మొదలు పెట్టిన వాటిని పూర్తి చేయడం లేదు. నిధులు మంజూరు చేసినా పనులు మొదలు పెట్టడంలేదు.
హనుమకొండలో కొత్త బస్టాండ్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 83 కోట్లు మంజూరు చేయగా, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొద్ది రోజులకే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అప్పటి నుంచి హనుమకొండ బస్టాండు నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ బస్‌స్టేషన్ నుంచి ప్రతి రోజూ 1500 బస్సులతో 3 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.
ఇక్కడి నుంచి గంటకు 200, రద్దీ సమయంలో 350 బస్సులు నడుస్తున్నాయి. రద్దీతో పాటు ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో బస్టాండు నిర్మాణం కోసం బీఆర్ఎస్ హయాంలో ప్రణాళిక రూపొందించగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పక్కనబెట్టింది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య పరంగా హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత వరంగల్‌కు ఉంది. ప్రజల సౌకర్యార్థం, మెరుగైన రవాణా కోసం హనుమకొండలో కొత్త బస్టాండ్ నిర్మాణం అవసరం ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండలోని ప్రస్తుత బస్టాండ్ భవనం పరిస్థితి దయనీయంగా ఉన్నది. ప్రస్తుతం రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచినప్పటికీ అందుకు తగ్గట్టుగా ప్లాట్‌ఫామ్స్ నిర్మించకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.
బీఆర్ఎస్ హయాంలోనే..
హనుమకొండ బస్‌స్టేషన్ ప్రస్తుత భవనాన్ని 16 ఎకరాల విస్తీర్ణంలో 1974 మార్చి 14న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రా రంభించారు. ఆ తర్వాత 12 ప్లాట్‌ఫామ్స్‌తో నిర్మించిన బస్టాండ్‌ను 1990 నవంబర్‌లో అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి మాదాడి నర్సింహారెడ్డి ప్రారంభించారు. వందేండ్ల జీవితకాల అంచనాతో నిర్మించిన ఆ భవనాలు కొన్నిచోట్ల పెచ్చులూడుతున్నాయి.
రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ప్లాట్‌ఫామ్స్ సరిపోవడంలేదు. పార్కింగ్ సౌకర్యం సరిగాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాన రవాణా కేం ద్రం హనుమకొండ బస్‌స్టేషన్. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్ 1, వరంగల్ 2, హనుమకొండ, నర్సంపేట, మ హబూబాబాద్, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, జనగామ డిపోల ఆధ్వర్యం లో ఆర్టీసీ బస్సులను తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు ఇక్కడి నుంచే నడిపిస్తున్నారు. రీజియన్ పరిధిలో మొత్తం 1,040 బస్సులుండగా, అందులో 700 ప్రభుత్వ, 340 ప్రైవేటువి ఉన్నాయి.
ఆర్టీ సీ డ్రైవర్లు 1,281, ప్రైవేటు డ్రైవర్లు 1,100, కండక్టర్లు 1,648, కాంట్రాక్ట్ కండక్టర్లు 120 మంది మొత్తం 1,800 మంది పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో హనుమకొండ బస్టాండులో వీరు కూర్చునేందుకు సైతం జాగా లేదు. ఇక వర్షం వస్తే హనుమకొండ బస్‌స్టేషన్ ప్రాంగణం నీటితో నిండి చెరువులా మారుతున్నది. నీళ్లలో నుంచి వెళ్లలేక ప్ర యాణికులు, ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.83 కోట్లతో అత్యాధునిక హంగులతో కొత్త బస్టాండ్ నిర్మించేందుకు సంకల్పించి 2023 అక్టోబర్ 6న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పనులు ప్రారంభించారు.
సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి, రెండో అంతస్తులతో వచ్చే 50 ఏండ్ల ట్రాఫిక్ నిర్వహణకు అనుగుణంగా బస్‌స్టేషన్ డిజైన్‌ను రూ పొందించారు. 170 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేలా సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రయాణికుల కోసం 35 ప్లాట్‌ఫామ్స్, విశ్రాంతి గది, షాపింగ్ కాంప్లెక్స్, క్యాంటీన్, కార్గో పార్సల్ సర్వీ స్ కార్యాలయం ఉండేలా ప్రతిపాదించారు. స్మార్ట్ సిటీలో భాగంగా హనుమకొండ బస్టాండు కొత్త భవనం నిర్మించేలా ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేయ గా, ఆ తర్వాత తొలగించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను పట్టించుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఆదేశాలు రావాలి
హనుమకొండ బస్‌స్టేషన్ ప్రస్తుత భవనం నిర్మిం చి 40 ఏళ్లు కావస్తున్నది. కొత్త భవనం నిర్మాణ ప్రతిపాదన ఉన్నది. వరంగల్ బస్‌స్టేషన్ భవనం పూర్తయి న తర్వాత హనుమకొండలో నిర్మిస్తారు. బస్టాండ్ కొత్త భవన నిర్మాణానికి ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి.
– డీ విజయభాను, రీజినల్ మేనేజర్, వరంగల్