నయీంనగర్, డిసెంబర్ 7 : ప్రజాప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవ సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నిర్వహించిన విజయోత్సవ సభ వెలవెలబోయింది. వక్తలు మాట్లాడకముందే జనం ఇంటిబాట పట్టారు. శనివారం సాయం త్రం 5.22 గంటలకు ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాలలో సభ ప్రారంభం కాగా, ఇద్దరు వక్తలు మాట్లాడే వరకే జనాలు ఉన్నారు. వారు మాట్లాడే మాటలకు విసుగుచెందారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఇప్పటి వరకు జనాలకు చేసిందేమీ లేదు.. కానీ, గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులేమీ చేయకుండానే ప్రచారాలు చేసుకుంటున్నారని వెనుదిరిగారు. అయితే, వచ్చిన నాయకులు మాట్లాడకముందే జనాలు పోతే పరువు పోతుందని భావించిన నిర్వాహకులు ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల ఆడిటోరియం రెండో గేట్‌కు తాళం వేశారు.
జనాలెవరూ బయటికెళ్లకుండా ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లో పనులు ఉన్నాయి.. గేట్ తెరవండి.. అంటూ ఎంత బతిమాలాడిన వినకుం డా జనాలను నిర్బంధించారు. కొందరు మొద టి గేట్ నుంచి వెళ్లే ప్రయత్నం చేసినా, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. గేట్‌కు తాళం వేసి జనాలను ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్ నాయకులు, అక్కడికి వచ్చిన ప్రజల ఫొటోలు తీసుకున్న జర్నలిస్టులుపై కొందరు కాంగ్రెస్ నాయకులు అమర్యాదగా ప్రవర్తించారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నారు..అవసరమా అనడంతో అక్కడే ఉన్న జనాలు ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
విజయోత్సవ సభ కవరేజికి వెళ్లిన జర్నలిస్టులకూ తిప్పలు తప్పలేదు. కేవలం కాంగ్రెస్ నాయకుల వాహనాలను మాత్రమే ఆడిటోరియం గేట్ ఎదుట పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసి,జర్నలిస్టులకు మాత్రం దూరంలో పార్కింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా అక్కడ కూర్చోడానికి కనీసం కుర్చీలు కూడా వేయకపోవడంతో నిలబడే విధులు నిర్వర్తించారు. దీంతో ఇదేం సభ అంటూ కొందరు జర్నలిస్టులు వెనుదిరిగారు.