Congress Govt | ‘సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు మా బతుకులు సల్లంగ ఉన్నాయి. నేతన్నల కోసం అమలు చేసిన పథకాలు మాకు ధైర్యాన్నిచ్చాయి. ఆనాడు చీకు, చింతా లేకుండా హాయిగా బతికాం. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చినంక కొత్తవి దేవుడెరుగు.. ఉన్న పథకాలనూ లేకుండా చేశాడు. గిప్పుడు ఎట్లా బతకాలో సమజ్ కావడం లేదు. రోజు రోజుకూ అన్ని ధరలు ఆకాశాన్నంటుతుంటే, మా బతుకులు పాతాళానికి పోతున్నాయి. చేతినిండా పనుల్లేక ఖాళీ కడుపులతోనే సహవాసం చేస్తున్నాం.
ఇంటి దగ్గర, సంఘాల్లో పని దొరకక పస్తులుంటున్నం. ఇప్పుడు మా జీవనం సాగేదెట్లా’ అని పలువురు నేత కార్మికులు లబోదిబోమంటున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన చేనేత మిత్ర, నేతన్నల బీమా, త్రిఫ్ట్ ఫండ్ అడ్రస్ లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వరకు ఇచ్చిన ఈ పథకాలు ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క పథకం కూడా ఇయ్యకుంటే మా బతుకులెట్లా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్రీ బస్సు వద్దు.. రూ. 4 వేల పింఛన్ ఇస్తే చాలు. పని చేసుకునే మేము ఊకె బస్సు ఎందుకు ఎక్కుతాం.. దీనివల్ల మాకేం లాభం’ అంటూ తమ అసంతృప్తి వెలిబుచ్చారు.
– పోచమ్మమైదాన్, డిసెంబర్ 29
సీఎం కేసీఆర్ హయాంలో చేనేత రంగానికి పెద్దపీట వేశారు. నేతన్నల కోసం పలు పథకాలు అమలు చేసి, అన్ని విధాలా ఆదుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేనేత మిత్ర, నేతన్నల బీమా, త్రిఫ్ట్ ఫండ్ పథకాల ఆచూకీ లేకుండా చేశారని నేతన్నలు ఆందోళన చేస్తున్నారు. చేనేత మిత్ర పథకంలో భాగంగా నేత కార్మికులకు అందజేసే యారన్ సబ్సిడీకి బదులుగా చేనేత సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులకు నెలకు రూ.2వేలు, నూలు చుట్టే, పట్టే కార్మికులకు నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందజేసేది.
అయితే ఏడాది నుంచి ఈ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే త్రిఫ్ట్ ఫండ్ కింద కార్మికుల వేతనాలను బట్టి నెలకు రూ. 800 చెల్లిస్తే రెట్టింపుగా రూ.1,600, నూలు పట్టే, చుట్టే కార్మికులు రూ. 400 కడితే రూ. 800 బ్యాంకులో జమ చేసేవారు. ఇదీ ఆగస్టు నుంచి బంద్ కావడంతో కార్మికులు బ్యాంకులో పొదుపు చేసుకునే పరిస్థితికి దూరమయ్యారు.
ఇక రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ పథకం జాడ లేదు. బీమాకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ గత ప్రభుత్వమే చెల్లించేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడంతో నేతన్నలు బీమా సదుపాయాన్నీ కోల్పోయారు. అలాగే సంఘాల్లో పేరుకుపోయిన స్టాక్‌ను సకాలంలో టెస్కో అధికారులు కొనుగోలు చేయకపోవడం, బకాయిలు చెల్లించకపోవడంతో చేనేత సహకార సంఘాలు చతికిల పడే దుస్థితి ఏర్పడింది. దీంతో కార్మికులందరికీ చేతినిండా పని కల్పించలేక పోతున్నామంటూ సంఘాల పర్సన్ ఇన్చార్జిలు చెబుతున్నారు.
25
సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు అన్నీ మాకు ఇవ్వాలి. కొత్త సర్కారు వచ్చి ఏం లాభం లేదు. మాకు చేతినిండా పని ఉండేటట్లు చేస్తుందని కలలు కంటే నిరాశే మిగిలింది. ఉన్న పథకాలు తీసేస్తే మేమెట్లా బతకాలి. చేతి నిండా పనిలేక చిల్లిగవ్వ ఉండడం లేదు. ఇట్లా అయితే మా పిల్లలను ఎట్లా చదివించుకోవాలె. పెళ్లిళ్లు ఎట్లా చెయ్యాలె. బయట పని చేసుకునే పరిస్థితి లేదు. సంఘాల్లో పనులు దొరకడం లేదు. ఇప్పటికే మా పిల్లలు ఇతర వృత్తులు చేస్తూ ఆసరాగా ఉంటున్నారు. మేము చేనేతను నమ్ముకుని జీవిస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకుంటే మాకు చావే శరణ్యం.
– సారయ్య, మొండయ్య, మధు, సత్తయ్య, చేనేత కార్మికులు
చేనేత కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి. చేనేత మిత్ర పథకాన్ని సక్రమంగా అమలు చేసి ఆదుకోవాలి. గతంలో నెలకు రూ. 2 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు నయాపైసా ఇవ్వకపోవడంతో ఎట్లా బతకాలి. రేవంత్‌రెడ్డి వచ్చి ఏమో చేస్తాడనుకుంటే ఉన్నవాటికి ఎగనామం పెట్టిండు. ఇన్సూరెన్స్ లేదు.. త్రిఫ్ట్ ఫండ్ అతీగతీ లేదు. ఇట్లా అయితే మేము పస్తులుండాల్సి వస్తుంది. పిల్లలను పోషించుకుకోలేకపోతున్నాం. దురదృష్టవశాత్తు కార్మికుడు చనిపోతే కనీసం బీమా డబ్బులపై ఆధారపడి కుటుంబ సభ్యులు బతుకుతారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టడం లేదని అధికారులు చెబుతున్నారు. మేం ఎవరికి చెప్పుకోవాలి.
– దుబాసి ఫర్మయ్య, ఎల్బీ నగర్
కాంగ్రెస్ సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు మాకొ ద్దు. దీనివల్ల మాకేం లాభం లేదు. మాకు ఇస్తామన్న రూ. 4 వేల పింఛన్ ఇస్తే చాలు. ఆ డబ్బులతోనైనా బతుకు తాం. పొట్టకూటి కోసం పని చేసుకునే మేము రోజు బస్సెక్కే పరిస్థితి లేదు. ఏడాదికి ఒకటి రెండుసార్లు బస్సులో పోతాం. అంతేగాని బస్సు ఫ్రీ పెట్టి మాకిచ్చే పథకాలు రద్దు చేస్తే ఎట్లా బతకాలి.
– రాచర్ల స్వర్ణలత, కొత్తవాడ
ఎప్పటి నుంచో నేత వృత్తి పై ఆధారపడ్డాం. ముసలితనంలోనూ చాతనైనంత పని చేసుకుంటూ బతుకుతు న్నాం. పొద్దంతా పని చేసి నా కడుపు నిండే పరిస్థితి లే దు. కనీసం మేం పోయినంకైనా ఇన్సూరెన్స్ డబ్బులొస్తే కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఉంటారు. ఇప్పుడు అదీ లేదని అధికారులు చెబుతున్నారు. ఇందిరమ్మ సర్కారు మమ్మల్ని ఆదుకుంటుందనుకుంటే, ఉన్నవాటిని తీసేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమో మీరే చెప్పాలి.
– నామని రమ, కొత్తవాడ