మహబూబాబాద్ రూరల్, మే 8 : భారీ వర్షాలు వచ్చి చెరువులు తెగి ఏడు నెలలవుతున్నా మరమ్మతులు చేయరా..? ఎక్కడా పనులు చేయలేదని, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం మహబూబాబాద్‌లోని జిల్లా ఇరిగేషన్ ఇంజినీరింగ్ కార్యాలయంలో చెరువు మరమ్మతు పనులపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ గతేడాది సెప్టెంబర్‌లో భారీ వర్షాల వల్ల జిల్లాలో మొత్తం 147 చెరువులకు గండ్లు పడ్డాయని, అందులో 134 చెరువులను ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారని, రైతులే 50 చెరువులకు తాత్కాలిక మరమ్మతు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం కేవలం 25 చెరువులకు శాశ్వత మరమ్మతు చేసేందుకు మంజూరు ఇచ్చినా ఇంత వరకు ఎక్కడా పనులు చేయలేదన్నారు.
రాష్ట్రంలోనే జిల్లాకు భారీ నష్టం జరిగిందని, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించి రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే చెరువులకు మర మ్మతులు చేయాలని చెప్పినా ఒక్క చెరువుకు కూడా పూర్తి దశలో పనులు చేయలేదన్నారు. తెగిపోయిన చెరువుల్లో నీళ్లు లేక రైతులు పంటలు పండించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిటీలు, చర్చలు పేరుతో కాలం వృథా చేస్తుందని, రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ దుర్భరంగా మారిందన్నారు. మళ్లీ వర్షా కాలం దగ్గరకు వచ్చిందని, చెరువుల మరమ్మతు పనులు ప్రారంభం కాలేదన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక, కాంటాలు కాక, ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల తెగిపోయిన చెరువుల శాశ్వత మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ఎడ్ల వేణుమాధవ్, మంగళంపల్లి కన్న, జేరిపోతుల వెంకన్న, కర్పూరపు గోపి, ఎస్ఈ వసంత్ కుమార్, డీఈలు రామచంద్రమూర్తి, రమేశ్, చిట్టిబాబు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.