Bhupalapally | మహదేవపూర్ (కాళేశ్వరం), జూన్ 25 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు విడతల రైతు భరోసా పథకం డబ్బులను ఎగ్గొట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ నేపథ్యంలో పూర్తిస్థాయిలో రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదైతే ఆరు గ్యారంటీలు అబద్ధపు హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చారో,ఆ హామీలను తక్షణమే పూర్తిస్థాయిలో అర్హులైన ప్రజలకు అమలు చేసి అప్పుడు సంబరాలు చేసుకుంటే ప్రజలు హర్షిస్తారని తెలిపారు. సంబరాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదు అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు.