హనుమకొండ, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీ ఎన్నికల్లో తలబొప్పి కట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురుకాబోతున్నది. తప్పని పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్‌కు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవడం ఆ పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతున్నది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లలో వేగం పెంచింది. అయితే పురపోరును ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతుండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అధిక పట్టణాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామనే ధీమాతో ముందుకు సాగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కాగా, పురపాలికల గడువు ముగిసి ఏడాదవుతున్నది. ఈ రెండేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టకపోవడం.. మున్సిపాలిటీలను పట్టించుకోకపోవడంతో పుర ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు డైలమాలో పడిపోగా.. తమ హయాంలో పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న నమ్మకంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి.
ఆశించిన స్థాయిలో గ్రామ పంచాయతీలను దక్కించుకోలేక నిరాశలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నది. జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సోమవారం రాజకీయ పార్టీలతో మున్సిపాలిటీల్లో, మంగళవారం జిల్లా కలెక్టరేట్లలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 10న వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. అనంతరం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనున్నది.
మున్సిపాలిటీల్లో బీసీ కోటాపై అప్పుడే స్పష్టత రానున్నది. 2020 జనవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పాలకవర్గాల పదవీకాలం 2025 జనవరిలోనే ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీల అభివృద్ధిని పట్టించుకోలేదు. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో ప్రజా తీర్పు ప్రతికూలంగా ఉంటుందనే ఆందోళనతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నది. కోర్టు ఆదేశాలు, గడువుల నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ భారీ ఆధిక్యతతో గెలిచింది. స్టేషన్‌ఘన్‌ఫూర్, ములుగు, కేసముద్రం మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీల పరిధిలో 260 వార్డులకు ఎలక్షన్స్ జరగనున్నాయి.
రాజకీయ పార్టీల గుర్తులతో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచి పురపాలికల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్‌పై అసంతృప్తి పెరిగింది. పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది.
రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్ల నిర్వహణ సక్రమంగా జరగడంలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు సైతం రావడంలేదు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కోవడం ఎలానో తెలియక కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే సతమతమవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేసింది. జనాభా ఆధారంగా పట్టణ ప్రగతి నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి ప్రతినెల రూ. 158 కోట్లు విడుదల చేసింది. వివిధ అభివృద్ధి పనుల నిధులకు తోడు ఇవి అదనంగా వచ్చేవి. 2024 ఫిబ్రవరిలో పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది. హరితహారం, పారిశుధ్య నిర్వహణ, నర్సరీలు, అర్బన్ ఫారెస్టు పార్కులు, వార్డులు వారీగా అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు పూర్తయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పక్కనబెట్టి, నిధుల విడుదలను నిలిపివేసింది. పాలకవర్గాల గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. పాలకవర్గాలు లేక, నిధులు రాక పట్టణాల్లో కనీస వసతులు కల్పించలేని పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనుల నేపథ్యంలో మున్సిపాలిటీల్లో గెలుపుపై గులాబీ పార్టీ ధీమాతో ఉన్నది.