సుబేదారి,సెప్టెంబర్ 29 : శాంతి భద్రతల పరిరక్షణలో 24 గంటలు డ్యూటీ చేసే పోలీసులకు నిరాశే ఎదురైంది. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందని ఎదురు చూడగా, పలుకుబడి ఉన్న మంత్రుల జిల్లాలకే అందాయి. పండుగ ఖర్చులకు పనికొస్తాయని ఆశపడిన పోలీసులకు కాంగ్రెస్ సర్కారు మొండి చేయి చూపింది. దీంతో తమకెందుకు ఇవ్వరంటూ వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల శాఖలో పనిచేస్తున్న వారికి సరెండర్ సెలవులు (సెలవులు పెట్టకుండా డ్యూటీ చేయడం), సెలవు డ్యూటీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే ఏడాదిన్నరగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసు శాఖ అంటేనే అత్యవసరమైన డిపార్ట్మెంట్. పండుగలు, అనుకోని సంఘటనలు, సభలు, సమావేశాలకు బందోబస్తు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో సాధారణ సెలవులను సైతం వాడుకోలేని పరిస్థితి. ప్రతి పోలీసుకు ఆరు నెలలకు 15 సెలవులకు సంబంధించిన డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. ఇవి కాకుండా డ్యూటీ పరమైన రవాణా ఖర్చులు(టీఏ), డీఏ ఎరియర్స్ (కరువు భత్యం బకాయిలు) సైతం ఏడాదిన్నరగా ప్రభుత్వం చెల్లించడం లేదు.
రాష్ట్రం ప్రభుత్వం సరెండర్ లీవులు, టీఏ, డీఏ ఏరియర్స్‌ను దసరాకు విడుదల చేస్తుందని వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న లా అండ్ ఆర్డర్, ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో పనిచేస్తున్న మొత్తం 3,200 మంది పోలీసులు ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం ఖమ్మం, ములుగు జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి మాత్ర మే రెండు రోజుల క్రితం సంబంధిత ఏరియర్స్‌ను బ్యాం కులో జమచేసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, ములుగు నుంచి మంత్రి సీతక్క ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండడంతో పెండింగ్ బిల్లులను విడుదల చేయించారు. దీంతో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమకెందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇస్తే అందరికీ ఇవ్వాలని, కొందరికి ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు, మొత్తంగా రూ. 10 కోట్లకు పైగా సరెండర్, టీఏ, టీఏ ఏరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయని, పండుగ లోపు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.