జనగామ, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ గత బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాలలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలో అధికారుల వైఫల్యం విద్యార్థులకు శాపంగా పరిణమిస్తున్నది. ఈమేరకు జనగామ కళాశాలలో విద్యాబోధనకు తగినట్టు సౌకర్యాలు లేవని, నిర్వహణ ఎనిమిది కేటగిరీల్లో లోపాలున్నాయంటూ ఎన్ఎంసీ(జాతీయ వైద్య కమిషన్) అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఇటీవల షోకాజ్ నోటీసులిచ్చిన నేపథ్యంలో బుధవారం జనగామ మెడికల్ కళాశాల నిర్వహణపై ఢిల్లీలో వర్చువల్ విచారణ చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య కమిషన్ తనిఖీ నివేదికల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు(యూజీఎంఈబీ) నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు హాజరుకాగా, జనగామ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వర్చువల్ విచారణకు హాజరయ్యారు. ఎంబీబీఎస్ వైద్య విద్య బోధనకు తగ్గట్లు జనగామలో సౌకర్యాలు లేవంటూ అన్నీ సమకూర్చుకొని లోపాలు సరిచేసుకునే వరకు నూతన విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లు కేటాయించలేమని అధికారులు స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేగాక పరిస్థితులు మెరుగుపడకుంటే అవసరమైతే గుర్తింపు రద్దుకు సిఫారసు చేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తుండగా అటు సర్కారు, అధికారుల తీరుతో సీట్ల కేటాయింపుపై నీలినీడలు కమ్ముకొని విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనున్నది.
ఇప్పటికే రెండేళ్లు పూర్తిచేసుకున్న జనగామ వైద్య విద్య కళాశాల ఈ ఏడాది సెప్టెంబర్ మాసం నుంచి ఎంబీబీఎస్ 3వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న తరుణంలో ఎన్ఎంసీ తాఖీదులు వైద్య విద్యార్ధుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయి. యూజీఎంఎస్ఆర్-2023 నిబంధనలకు అనుసరించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు..బోధన సమయంలో సరిపడా రోగులు, ప్రాక్టికల్స్‌కు అవసరమైన పార్థివదేహాలు, రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీలు, ఆధార్ అనుసంధానంతో విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు విధానం, పలు విభాగాల్లో కనీన మౌలిక సౌకర్యాలు అసలే లేవంటూ ఆధారాలతో సహా ఎన్ఎంసీ ఎత్తిచూపిందని సమాచారం. వీటితో పాటు ఎన్ఎంసీ నిబంధనల మేరకు 420 పడకలకు గానూ ఎంసీహెచ్‌లో 400 బెడ్లు మాత్రమే ఉన్నాయని, సిటీ స్కాన్, ఎమ్మారై సేవలు, పెద్దా, చిన్నా ఆపరేషన్ థియేటర్లు లేవని, డాక్టర్ల సంబంధించి డిక్లరేషన్ సహా ఇతర ఫారంలను నిబంధనల మేరకు పూర్తి చేయడంలేదని ఎత్తిచూపినట్లు తెలుస్తున్నది.
గడువు ప్రకారం ఇప్పటికే పూర్తి కావాల్సిన భవన నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పుతున్నట్లుగా నేటికీ పూర్తికాలేదు. మరోవైపు కళాశాలకు దూరంగా వసతి గృహాలు ఉండడం.. మెడికోల రాకపోకలకు సరైన వాహనాలు అందుబాటులో లేకపోవడం.. మరోవైపు బోధనా సిబ్బంది కూడా లేక విద్యార్థులు నష్టపోవాల్సి వస్తున్నది. జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన జనరల్ ఆస్పత్రి సహా చంపక్స్హిల్స్ ఎంసీహెచ్(మాతా శిశు సంరక్ష ఆరోగ్య కేంద్రం) ప్రాంగణంలోని తాత్కాలిక రేకుల షెడ్డుల్లో ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండియర్ తరగతులు జరుగుతున్నాయి. పసరుమడ్ల వద్ద ఉన్న అనాథ వృద్ధాశ్రమంలో విద్యార్థినుల హాస్టర్, చంపక్‌హిల్స్ డీఆర్డీవో భవనంలో విద్యార్థుల హాస్టల్ నిర్వహిస్తున్నారు. మెడికల్ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి. పట్టణంలోని గీతాశ్రమం వద్ద పక్కా భవన నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో పర్యవేక్షణ కరువైంది.
మెడికల్ కళాశాలలో 117 పోస్టులకు గాను 82మంది రెగ్యులర్ ఉద్యోగులు, ఏడుగురు కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా ఇంకా 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఉన్న పోస్టుల్లో కొందరు హైదరాబాద్ నుంచి ప్రిన్సిపాల్ సహా మరికొందరు హనుమకొండ, వరంగల్ నుంచి రాకపోకలు సాగిస్తుండగా వైద్యుల ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ లేకపోవడంతో వాళ్లు వచ్చినప్పుడే మెడికోలకు పాఠాలు బోధిస్తునట్లు తెలుస్తున్నది. అటు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు కూడా ఇలా వచ్చి అలా వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ప్రిన్సిపాల్ కూడా పూర్తిస్థాయిలో కాలేజీకి రాకపోవడంతో ఇటు పరిపాలన, తరగతుల నిర్వహణ గందరగోళంగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి.