పంటలు పండించేందుకు ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతలు.. వాటిని అమ్ముకునేందుకు అంతకు రెట్టింపు కష్టాలు పడుతున్నారు. అవసరమైన బస్తాలు రాక.. కాంటాలు కాక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. విత్తనం వేసిన దగ్గరి నుంచి యూరియా, సాగునీటి కష్టాలు దాటుకొని పంట అమ్ముకునే వరకు ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. ఉత్పత్తికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. ఉన్న అరకొర సెంటర్లకు రైతులు పోటెత్తడంతో మక్కల రాశులు పేరుకుపోతున్నాయి. అధిక ప్రాంతాల్లో కొనుగోళ్లు జరగడం లేదు. మరికొన్ని చోట్ల మందకొడిగా సాగుతుండడం రైతులకు శాపంగా మారింది.
బయ్యారం, ఏప్రిల్ 13 : బయ్యారం మండలంలో మక్కల కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాది యాసంగిలో జిల్లాలోనే అత్యధికంగా బయ్యారం మండలంలో 26,145 ఎకరాల్లో మక్కజొన్న పంటను గిరిజన రైతులు సాగు చేయగా, సుమారు 90 మెట్రిక్ టన్నుల పంట వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే, పండించిన మక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం కస్తూరినగర్, ఉప్పలపాడు, కంబాలపల్లి, రామచంద్రాపురం, బయ్యారం మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
అయినా కొనుగోళ్లు మాత్రం మందకొడిగా సాగుతుండడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఐదు కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు కేవలం 150 మంది రైతులకు చెందిన సుమారు 10వేల500 క్వింటాళ్లు (10వేల బస్తాలు) మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా మిగిలిన మక్కలు కొనుగోలు చేయాల్సి ఉన్నది. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల లేమితోపాటు కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతుడటంతో మక్కలను తీసుకొచ్చిన రైతులు కేంద్రాల వద్దే పడిగాపులుగాయలేక అవస్థలు పడుతున్నారు.
బయ్యారం, రామచంద్రాపురం కొనుగోలు కేంద్రంలో బస్తాలు లేక, కంబాలపల్లిలో లారీలు రాక కాంటాలు నిలిచిపోయాయి. కేంద్రాల్లో పోసిన మక్కలు తేమ శాతం వచ్చినా కొనుగోళ్లు కాకపోవడంతో రైతులు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఏజెన్సీలోని మిర్యాలపెంట, లక్ష్మీపురం పంచాయతీలకు చెందిన రైతులు కంబాలపల్లి కేంద్రంలో విక్రయించాల్సి ఉండగా, రవాణా భారంతో ఇబ్బందిపడుతున్నారు. ఎకరాకు 40 క్వింటాల వరకు దిగుబడి వస్తుండగా ప్రభుత్వం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం, పట్టాలేని రైతుల మక్కజొన్నలు కొనకపోవడం వంటి కారణాలతో రైతులు మళ్లీ దళారులను ఆశ్రయిస్తున్నారు.
యాసంగిలో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటవేశాం. వారం రోజుల క్రితం బయ్యారం కొనుగోలు కేంద్రానికి మక్క పంట తీసుకొచ్చా. 12 శాతం మాయిశ్చర్ వచ్చింది. బస్తాలు లేక పోవడంతో రెండు రోజులుగా కంటా వేయడం లేదు. కేంద్రం వద్ద పడిగాపులు కాయ లేక ఇబ్బంది పడుతున్నాం. వెంటనే కాంటాలు వేస్తే బాగుంటుంది.
– బాల కిషన్, రైతు, గంథంపల్లి
మార్కెట్లో జొన్నలు పోసి వారం రోజులైనా సీరియల్ రాలేదు. పొద్దున వచ్చి రాత్రి పోవుడైతంది. సార్ల చుట్టూ తిరిగితే సీరియల్ రాలే అంటున్నరు. కాంటాలు కావడం లేదు.. ఏంది సారు అని అడిగితే బస్తాలు లేవని అంటున్నరు. బస్తాలు రావు కాంటాలు కావు. చేసేదేమి లేక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మకుంటున్నాం. ఒక్కో రైతుకు వందల బస్తాల పంట పండింది. ఎప్పుడు కాంటాలు పెడుతరో తెల్వదు. కనీసం మార్కెట్లో తాగుదమన్నా నీళ్లు లేవు, వసతులు లేవు. ఎండ కొడుతున్నది. టెంట్లు కూడా వేయలేదు, కలెక్టర్ స్పందించి కాంటాలు త్వరగా అయ్యేలా చూడాలి.
– ఏనుగు సోమయ్య, రైతు విస్నూరు
రెండు రోజుల నుంచి బస్తాలు రావడం లేదు. 90మంది హమాలీ కార్మికులం చెట్ల కింద కూర్చుంటున్నాం. అధికారులు బస్తాలు పంపితే కాంటాలయ్యేవి. మార్కెట్లో మక్కజొన్న రాసులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అధికారులేమో బస్తాలు పంపించడం లేదు. దీంతో చేసేదేమీ లేక చెట్ల కింద ఖాళీగా కూర్చుంటున్నాం. ఇట్లయితే రెండు నెలలైనా కాంటాలు కావడం కష్టం. తక్షణమే అధికారులు రోజుగారీగా బస్తాలు లారీలు పంపిస్తే రైతులకు కష్టాలు తీరుతాయి.
– బుడిగే మల్లేశ్ హమాలీ కార్మికుడు, మంచుప్పుల