రాయపర్తి, మే 8: మక్క రైతులను పట్టించుకునేవారే రాష్ట్రంలో లేరా.. అని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులను తెలుసుకున్న ఎర్రబెల్లి శుక్రవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బాధిత రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు సరఫరా చేయడం లేదని, లారీలు, హమాలీల కొరత ఉందని, యాజమాన్యం రైతులను చిన్నచూపు చూస్తూ నానాబూతులు తిడుతూ మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దుర్భాషలాడుతున్నారని వాపోయారు. రైతుల సమస్యలు విని చలించిపోయిన ఎర్రబెల్లి మార్క్‌ఫెడ్ అధికారులు రాయపర్తికి వచ్చి పరిష్కరించేంత వరకు ఎన్ని రోజులైనా సరే జాతీయ రహదారిపైనే కూర్చుంటానని భీష్మించుకున్నారు. రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు. అనంతరం మార్క్‌ఫెడ్ జీఎంతో ఫోన్లో మాట్లాడుతూ.. రాయపర్తిలో మక్క రైతులు పడుతున్న కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.
సమస్యలన్నీ 24గంటల్లోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆదివారం 5వేల మంది రైతులతో రాయపర్తిలోని జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్సై ముత్యం రాజేందర్ ఆందోళనకారుల వద్దకొచ్చి రాస్తారోకో విరమించాలని కోరగా ‘ మాజీ మంత్రి ఎర్రబెల్లి రెండు చేతులు జోడించి దండం పెట్టారు. ఎస్సై రాజేందర్ గారూ.. మీకు రైతుల కష్టాలు కనపడడం లేదా…ఇంత అధ్వానమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా చూశామా చెప్పండి అంటూ వేడుకున్నారు. రైతు కష్టాలు తీరేంత వరకు ధర్నా విరమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య, కర్ర రవీందర్‌రెడ్డి, లేతాకుల రంగారెడ్డి, రాంచందర్, ప్రసాద్, ఎల్లాగౌడ్ పాల్గొన్నారు.