LPG production : ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. గృహ, ఎల్పీజీ వాణిజ్య సిలిండర్లు లభించడం కష్టమైపోయింది. బ్లాక్ మార్కెట్లో డబుల్, ట్రిపుల్ రేట్లు పెట్టి కొనాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని చమురు ఉత్పత్తి, రిఫైనరీ సంస్థలకు ఈ నెల 13న కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది. రోజుకు 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని దేశంలోని 21 రిఫైనరీలను ఆదేశించింది. ఈ టార్గెట్ చాలా పెద్దది.
గత మార్చితో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఎల్పీజీ ఉత్పత్తికి ఇది రెట్టింపుకంటే ఎక్కువ. అలాగే, ప్రస్తుతం దేశంలో ఒక రోజు వినియోగమవుతున్న గ్యాస్లో 70 శాతం. అయితే, ఇది ఇప్పటికిప్పుడే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం విదేశాల నుంచి చమురు సరఫరా తగినంతగా లేకపోవడే ఇందుకు కారణం. కొద్ది రోజులుగా హార్ముజ్ జలసంధి మూసి ఉండటంతో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో తగినంత చమురు దిగుమతి జరిగితే, రిఫైనరీ కంపెనీలు ఈ టార్గెట్ను అందుకుంటాయి. దేశంలో ఉన్న రిఫైనరీ కంపెనీలలో 18 రిఫైనరీలు ప్రభుత్వం రంగ సంస్థలే. వీటికి రోజుకు 31,470 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయాల్సిందిగా కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రైవేటు రిఫైనరీలలో అత్యధికంగా ఎల్పీజీ ఉత్పత్తి చేసే సామర్ధ్యం రిలయన్స్ సంస్థకు ఉంది. ఈ సంస్థ రోజుకు 18,000 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయగలదు. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిఫైనరీలో ఏడాదికి 33 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగలదు.
ఆ తర్వాత కోచిలోని బీపీసీఎల్ సంస్థ 4,800 టన్నులు, రష్యాకు చెందిన నయారా ఎనర్జీ సంస్థ 4,480 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయగలవు. ఈ మూడు కంపెనీలు కలిపి 27,280 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయగలవు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో 33.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగమైంది. అంటే, రోజుకు సగటున 91,000 టన్నులు. వీటిలో 13.1 మిలియన్ టన్నుల ఎల్పీజీ దేశీయంగా ఉత్పత్తి అయితే, మిగిలిన 21.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని విదేశాల నుంచి దిగుమతి చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి దేశంలో చమురు ఉత్పత్తి, వినియోగంపై సమీక్ష జరుపుతుంది. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.