Chintha Prabhakar | రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి చీడపీడలా మారారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా సాగిందని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. తనను మాత్రమే కాకుండా సంగారెడ్డి ప్రజలను కూడా సీఎం అవమానించారని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సంగారెడ్డి గడ్డపై అడుగుపెట్టే హక్కు రేవంత్‌రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. సీఎం సంగారెడ్డిలో బజారు భాష మాట్లాడారని విమర్శించారు. ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేశారని అన్నారు.
క్షుద్ర పూజల డ్రామాకు సీఎం తెరలేపారని, ముఖ్యమంత్రి పదవిలో ఉండి మూఢనమ్మకాల గురించి మాట్లాడటం సరికాదన్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన ఎమ్మెల్యేను పక్కన పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లుగా రేవంత్‌రెడ్డి వ్యవహరించారని విమర్శించారు.
జగ్గారెడ్డి ఇంద్రుడు, చంద్రుడు అయితే సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. జగ్గారెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదని వ్యాఖ్యానించారు. రేషన్, స్మార్ట్ కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.